Weather Report: తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు.. ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన.. ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. తుఫాన్లు, వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు జిల్లాల్లో వర్షాలు పడనుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో భానుడి తీవ్రత కొనసాగనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఐద్రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. దీనికి కారణం తుఫాన్లు, వాయుగుండం. ఆస్ట్రేలియా వైపు మైలా, వలను అనే రెండు తుఫాన్లు ఏర్పడగా.. హిందూ మహాసముద్రంలో ఇందుసా అనే వాయుగుండం కొనసాగుతోంది. ఈ కారణాలతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న కొద్ది రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇక అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏప్రిల్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 5 రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది.
భారీ వర్షాలకు ఛాన్స్
ఏప్రిల్ మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర వరకు భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇక పిడుగుపాటు హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక రాయలసీమలో ఎండ ప్రభావం ఉంటుందని, ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతాయని స్పష్టం చేశారు. 39 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణశాఖ సూచించింది. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
తెలంగాణకు వర్షసూచన
ఇక ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉదయం నుంచి స్వల్ప వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఇక సాయంత్రం ఖమ్మం పరిసర ప్రాంతాల్లో వానలు కురుస్తాయంది. ఈదురుగాలులు 26 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, బైక్‌పై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దక్షిణ తెలంగాణతో పాటు హైదరాబాద్‌లో ఎండ తీవ్రత ఉండే అవకాశముంది. 38 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. భానుడి ప్రతాపంతో పాటు ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఇంట్లో ఏసీలు, కూలర్లు వాడుతున్నారు. ఇక శీతల పానీయాలు తీసుకుంటున్నారు. ఎండ ప్రభావం ఇలాగే కొనసాగే అవకాశముందని, రానున్న రోజుల్లో మరింత తీవ్రతరం అవుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ఎండ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాావొద్దని హెచ్చరించింది. వృద్దులు, పిల్లలు, గర్బిణుల ఎండ ప్రభావం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
