RBI కొత్త రూల్స్.. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నవారికి గుడ్‌న్యూస్!
ఆర్‌బిఐ ప్రకటించిన నూతన మార్గదర్శకాల ప్రకారం, 2026 జూలై 1 నుండి బ్యాంకులు ప్రకృతి వైపరీత్యాల బాధితులకు స్వయంగా రుణ ఉపశమనం అందిస్తాయి. దరఖాస్తు లేకుండానే బ్యాంకులు పునర్వ్యవస్థీకరణ చేస్తాయి. విపత్తు సేవలకు నిరంతరాయంగా అందించేలా చర్యలు, ఫీజుల మాఫీ వంటివి ఉన్నాయి.

భారత బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పుగా RBI ప్రకృతి వైపరీత్యాల బాధితులకు తక్షణ ఉపశమనం అందించే కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఇవి 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు విపత్తు సమయంలో రుణ ఉపశమనం పొందాలంటే వినియోగదారులు స్వయంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. కానీ తాజా నిబంధనల ప్రకారం, ఇకపై బ్యాంకులే ముందడుగు వేసి అర్హులైన ఖాతాదారులకు సహాయం అందించవచ్చు. అంటే వరదలు, భూకంపాలు లేదా ఇతర విపత్తులు సంభవించిన ప్రాంతాల్లో బ్యాంకులు ప్రత్యక్షంగా స్పందించి రుణ పునర్వ్యవస్థీకరణ వంటి చర్యలు తీసుకోవచ్చు.
అయితే ఈ ఉపశమనాన్ని అందరికీ బలవంతంగా అమలు చేయరు. ఎవరైనా వినియోగదారు ఈ సదుపాయం వద్దనుకుంటే, విపత్తు ప్రకటించిన 135 రోజుల్లోపు దానిని తిరస్కరించుకునే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనలు వాణిజ్య బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, NBFCల వరకు విస్తృతంగా వర్తిస్తాయి. సేవల నిరంతరతపై కూడా ఆర్‌బిఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. విపత్తు సమయంలో బ్యాంకులు తాత్కాలిక ప్రదేశాల నుంచి పనిచేయడం, మొబైల్ బ్యాంకింగ్ యూనిట్లు, శాటిలైట్ కార్యాలయాలు, ఎక్స్‌టెన్షన్ కౌంటర్ల ద్వారా సేవలు అందించడం అనుమతించబడింది. అలాగే ATM సేవలను త్వరగా పునరుద్ధరించి, నగదు కొరత లేకుండా చూసుకోవాలని సూచించింది.
ఫీజుల విషయంలో కూడా కొంత ఊరట కల్పించబడింది. బ్యాంకులు తమ విచక్షణ మేరకు ఒక సంవత్సరం వరకు కొన్ని ఛార్జీలను తగ్గించవచ్చు లేదా పూర్తిగా మాఫీ చేయవచ్చు. అయితే ఈ సదుపాయం గతంలో సక్రమంగా రుణాలు చెల్లించిన, 30 రోజులకు మించిన బకాయిలు లేని ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, విపత్తు కారణంగా NPAగా మారిన ఖాతాలను తిరిగి స్టాండర్డ్ అసెట్ గా వర్గీకరించేందుకు అవకాశం ఇవ్వడం. అయితే ఇందుకు బ్యాంకులు అదనంగా 5 శాతం ప్రొవిజన్ ఉంచాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
