AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Liberation Day: నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి పోరులో ‘నిజామాబాద్‌’.. రజాకార్ల తూటాలకు బలైన యోధులు

Telangana Liberation Day: సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం. రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలోని నీలకంఠేశ్వర ఆలయం ప్రాంగణంలో జరిగిన ఆంధ్రమహాసభ..

Telangana Liberation Day: నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి పోరులో 'నిజామాబాద్‌'.. రజాకార్ల తూటాలకు బలైన యోధులు
Telangana Liberation Day
Subhash Goud
|

Updated on: Sep 17, 2022 | 6:35 AM

Share

Telangana Liberation Day: సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం. రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలోని నీలకంఠేశ్వర ఆలయం ప్రాంగణంలో జరిగిన ఆంధ్రమహాసభ తెలంగాణ విమోచన పోరాటానికి నాందిపలికింది. నిజాం వ్యతిరేక పోరాటంలో ‘ఇందూరు’ మొదట నిలిచింది. ఆర్యసమాజం స్ఫూర్తినిచ్చింది. ఇందూరులో రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన కిషన్ మోదానిని ముష్కరులు కాల్చిచంపారు. ఆయన మరణంతో ఉద్యమం తీవ్రమైంది. వందలాది తెలంగాణ విమోచన యోధులను నిజామాబాద్‌ ఖిల్లా జైలులో బంధించి రజాకార్లను ఉసిగొల్పి నిజాం అకృత్యాలకు పాల్పడ్డాడు. ఈ ఖిల్లా వందలాది యోధుల మరణానికి మూగసాక్షిగా నిలిచింది. ఇది రాజకీయ ఖైదీలకు బొందలగడ్డ అని నిజాం ప్రకటించాడు. ఈ అణచివేతలను నిరసిస్తూ అక్కడే ఉన్న ప్రముఖ కవి దాశరథి ఓ నిజాము పిశాచమా నినదించారు. నిజామాబాద్‌ జైలులో ఉన్నప్పుడే ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్యులు నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే గేయాన్ని ఖిల్లా జైలు గోడలపై రాశాడు.

కామారెడ్డి ప్రాంతంలో రైతుల వద్ద నుంచి బలవంతంగా సేకరించిన ధాన్యాన్ని భిక్కనూరు రైల్వేస్టేషన్ సమీపంలోని గిర్నీలో దాచేవారు. 1947లో సాయుధ యోధులు ధాన్యాగారంపై దాడిచేశారు. ఈ సంఘటనలో కీలకపాత్ర వహించిన కుర్రిబాల్ లింగం, వెంకటబాలయ్య తదితర ఐదుగురిని నిజామాబాద్‌ ఖిల్లా జైలుకు పంపించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన రాఘవరెడ్డి ఆర్యసత్యాగ్రహంలో పాల్గొని 6 నెలల పాటు జైలుకు వెళ్ళాడు. కామారెడ్డికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ఫణిహారం రంగాచారి నిజామ్ దురాగతాలపై చిత్రాలు గీసి, ప్రదర్శించి ప్రజలలో చైతన్యం తెచ్చాడు. ఇతని చిత్రాలు ఇప్పటికీ హైదరాబాద్‌లోని ముక్దుం భవనాల్లో ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన లక్క కిష్టయ్య 100 మంది యువకులతో ఆయుధాలు చేపట్టి నిరంకుశ నిజాంకు, దాష్టీక రజాకార్లకు వ్యతిరేకంగా సాయుధ ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించాడు.

రజాకర్ ఖాసింరజ్వీ తమ్ముడు అబ్బాస్ రజ్వీ కామారెడ్డి సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా పని చేసిన కాలంలో అతను పెట్టిన బాధలను అనుభవించిన వారిలో కామారెడ్డి మాజీ శాసన సభ్యులు బి.బాలయ్య ఒకరు. దేశభక్తి గీతాలు పాడినందుకు చావుదెబ్బలు తిన‌వ‌ల‌సి వచ్చింది. ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలో సుంకి కిష్టయ్య నిజామ్ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు.1947 గాంధీ జయంతి రోజున కళ్యాణిలో జరిగిన పోరాటంలో ఏడుగురిని అరెస్టు చేసి బీదర్ జైలుకు త‌ర‌లించారు. మారుమూల పల్లె మానాల రజాకార్ల గుండెల్లో రైళ్ళు నడిపించింది. తెలంగాణ విముక్తి కోసం రజాకార్లకు వ్యతిరేకంగా తుపాకులు, మందుగుండులు స్వతంగా తయారు చేసుకున్నారు. ఆర్మూర్, కామారెడ్డి, సిర్పూర్ ప్రాంతాలకు మానాల కేంద్రంగా పని చేసింది. బద్దం ఎల్లారెడ్డి తదితరులు ఇక్కడే పోరాటయోధులకు గెరిల్లా శిక్షణ ఇచ్చేవారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ గడీల

రాజులు, రాచరికాలు, అరాచకంగా రాజ్యాలేలిన చరిత్ర ప్రపంచ వ్యాప్తమే.. అది గతించిన కాలం. మన దేశంలో రాచరిక వ్వవస్త రూపు మాసి పోయి శతాబ్దాల కాలమే అయినది. బ్రిటిష్ వారి పాలనలో మెల్లి మెల్లిగా రాచరికపు వ్వవస్త రూపు మాసిపోయింది. దేశం మొత్తానికి 1947 ఆగష్టు 15 న స్వాతంత్రం వచ్చినా ఈ దేశంలోని మూడు సంస్థానాలలోని ప్రజలు స్వాతంత్రానికి నోచుకోలేదు. ఆయా సంస్థానాల రాజులు మొండి పట్టుదలతో స్వాతంత్ర భారత్ లో కలవ డానికి ఒప్పుకోలేదు. అవి హైదరాబాద్ సంస్థానం, కాశ్మీర్ రాజ్యం, జునాఘడ్ సంస్థానం. కాశ్మీర్ రాజ్యంలో ప్రజలందరు ఎక్కువగా ముస్లింలు అయితే రాజు మాత్రం హిందువు. కానీ హైదరాబాద్ సంస్థానంలో ప్రజలందరు ఎక్కువగా హిందువులైతె రాజు మాత్రం ముస్లిం.

హైదరాబాద్ నైజాం తన రాజ్యాన్ని పరిపాలన సౌలబ్యంకొరకు చిన్న చిన్న విభాలుగా చేసి ఆ ప్రాంతాన్ని ఒక దొర చేతిలో పెట్టాడు. ఆ దొర ఆ ప్రాంతానికి జమీందారు. పరిపాలన అంతా అతని కనుసన్నలలోనె జరిగేది. అతనొక నియంత, క్రూరుడు. ప్రజలను పీడించుకుతినే వాడు. ఆ దొర సంవత్సరాని ఇంత అని నిజాంకు కప్పం కట్టే వాడు. స్థానికి పరిపాల అంతా తన ఇష్ట ప్రకారమే జరిపేవాడు. అప్పటికే ప్రజలు నిజాం పైన, స్థానిక పాలకుడైన దొరల పైన కోపంగా వున్నారు. ఇంతలో భారత ప్రభుత్వం ఈ సంస్థానాలను స్వతంత్ర భారత్ లో విలీనం చేయాలని ఒత్తిడి తెచ్చింది. దానిని వ్వతిరేకించిన నిజాము , అతని సహచరులు స్థానిక దొరలు ప్రజలపై పడి విపరీతంగా భాదించి దోచుకోవడం ప్రారంభించారు.

దీంతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు నిజాము పైన, స్థానిక దొరలపైన సాయుధ తిరుగుబాటు చేశారు. నిజాముకు మద్దతుగా కొన్ని దుష్ట శక్తులు, ప్రజలకు మద్దతుగా స్థానిక కమ్యునిష్టులు, ఇతరులు, కలిసి రాగా భారత ప్రభుత్వం సెప్టెంబర్‌ 13 న సైనిక చర్య జరిపి అండగా నిలవగా ఏడాదికి పైగా ఆలస్యంగా సెప్టెంబర్ 17 న తెలంగాణకు స్వాతంత్రం లభించింది. అందుకే సెప్టెంబర్ 17, 1948న పోలీస్ చర్యలో భాగంగా నిజాం భారత యూనియన్ కు లొంగిపోయారు. దీంతో హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో విలీనమైంది.

నైజాం రాజ్యంలో స్థానిక పాలకులైన దొరలు నివాసాలకు, రాజరికపు అరాచకపు కార్యకలాపాలకు నెలవులైన కట్టడాలే గడీలు. అనగ చిన్న చిన్న కోటలే ఈ గడీలు. ప్రజల తిరుగుబాటు సమయంలో గడీల పాలకులైన దొరలు తమ భూములను, గడీలను వదిలి హైదరాబాద్ నగరానికి పారిపోయి నిజాం రక్షణలో ఆశ్రమం పొందారు. ఆ విధంగా వెల్లిన దొరలు నగరంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని జీవించ సాగారు. ఇప్పుడు భూములకు, స్థిరాస్తులకు విపరీతమైన విలువ పెరగడంతో ఆ మాజీ దొరలకు, లేదా వారి వారసులకు తమ గడీలు, తమ భూములు గుర్తుకొచ్చి తమ పల్లె బాట పట్టారు. తమ గడిలను, భూములను అమ్మకానికి పెట్టారు.

కానీ స్థానిక ప్రజలు ఆ గడిలు భూములు తమ శ్రమ దోపిడి పలితాలను కనుక అవి తమ ఉమ్మడి ఆస్తి అని దొరలకు అడ్డు తగులుతున్నారు. నిజాం లొంగు బాటు తో నిజాం పాలనా భవనాలు, ఇతర రాజరికపు కట్టడాలు ఎలా ప్రభుత్వం పరమైనాయే అదే విధంగ ఈ గడీలు, దొరల భూములు తమ ఉమ్మడి ఆస్తులని ప్రజల వాదన. ఈ వాదనతో గత కాలపు గడీల చరిత్ర మరలా తెరపైకి వచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి