Telangana: తాను తీసుకున్న గోతిలో తానే పడింది.. కేంద్రప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్..
కేంద్రప్రభుత్వంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైరయ్యారు. అవకాశం దొరికనప్పుడల్లా ట్విట్టర్ వేదికగా కేంద్రప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్న కేటీఆర్ నూకల ఎగుమతులపై కేంద్రం తీసుకున్న..
Telangana: కేంద్రప్రభుత్వంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైరయ్యారు. అవకాశం దొరికనప్పుడల్లా ట్విట్టర్ వేదికగా కేంద్రప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్న కేటీఆర్ నూకల ఎగుమతులపై కేంద్రం తీసుకున్న నిర్ణయంలో లోపాలను ఎత్తిచూపారు. ఈవిధమైన నిర్ణయం తీసుకోవడానికి కేంద్రప్రభుత్వమే కారణమన్నారు. కేంద్రప్రభుత్వ అసంబద్ధ విధానాలతో దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందని విమర్శించారు. తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని అభాసుపాల చేసే ప్రయత్నంలో కేంద్రప్రభుత్వం తాను తీసుకున్న గోతిలో తానే పడిందన్నారు. వివక్షతో తెలంగాణ ఆహార ధాన్యాలు కొనుగోలు చేయకుండా.. దేశ ప్రజల ఆహార భద్రతను కేంద్రం పణంగా పెట్టిందని విమర్శించారు. వన్ నేషన్ వన్ ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని అనుసరించాలని, రాష్ట్రంలో పండించిన పంటను కొనుగోలు చేయాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal)ను ఈసందర్భంగా కేటీఆర్ కోరారు. నాలుగేళ్లకు సరిపోయే గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని ఆరు నెలల క్రితం గొప్పగా చెప్పుకున్న కేంద్రప్రభుత్వం తాజాగా బియ్యం ఎగుమతులను నియంత్రించి 20% ఎగుమతి సుంకాన్ని విధించిందన్నారు. ఇప్పటికే గోధుమలు, వాటి ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్రప్రభుత్వం.. తాజాగా నూకల ఎగుమతిపైనా నిషేధం విధించిందని మండిపడ్డారు.
FCI గోదాముల్లో, ఇతర కేంద్రాల్లో బియ్యం, నూకలు, గోధుమల నిల్వలు భారీగా తగ్గడంతోనే నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ విమర్శించారు. దేశ ప్రజల అవసరాలపై కనీస అవగాహన లేకపోవడం, ఆహార ధాన్యాల సేకరణలో స్పష్టమైన విధానం లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని దుయ్యబట్టారు. దేశ ప్రజల ఆహార అవసరాలపై కేంద్రానికి దీర్ఘకాలిక ప్రణాళిక లేదనే విషయం స్పష్టమైందన్నారు. దేశాభివృద్ధి, ప్రజాసంక్షేమంపై కనీస అవగాహన, ఆలోచన, ప్రణాళిక లేని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండడం ప్రజల దురదృష్టమని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని అవమానించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇప్పుడు నూకల ఎగుమతులను నిషేధించి వాటినే తింటారేమోనని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..