High Court: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజుల పెంపు జీవో కొట్టివేసిన హైకోర్టు!
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పీజీ వైద్య కాలేజీలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
High Court on PG Medical Colleges Fees: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పీజీ వైద్య కాలేజీలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ జీవోను తోసిపుచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు వైద్య కాలేజీల్లో 2017-2020కి గానూ ఫీజులను పెంచుతూ 2017 మే 9న ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీని అభ్యంతరం వ్యక్తం చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. టీఏఎఫ్ఆర్‌సీ సిఫార్సు లేకుండా ప్రభుత్వం ఫీజులు పెంచిందంటూ పిటిషన్లు కోర్టుకు వివరించారు. ప్రభుత్వం ఏక పక్షంగా ఫీజులను నిర్ణయించిందని మండిపడ్డారు. దీంతో సామాన్యులపై అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ఇరువురి వాదనలు విన్న తర్వాత ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేసింది.
గతంలో సూచించిన విధంగా 2016-19కి టీఏఎఫ్ఆర్ సీ ఖరారు చేసిన ఫీజులే తీసుకోవాలని వైద్య కాలేజీలను హైకోర్టు ఆదేశించింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తే 30 రోజుల్లో తిరిగి ఇచ్చేయాలని కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అలాగే, ఇప్పటికే మెడికల్ కోర్సు పూర్తి చేసిన పీజీ వైద్య విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేయాలని కాలేజీలకు సూచించింది. లేదంటే తగిన చర్యలు తప్పవని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది.
Read Also…. BJP Fight: తెలంగాణ బీజేపీలో ముదిరిన ముసలం.. తగ్గేదిలే అంటున్న అసమ్మతి నేతలు!