Kothapet Fruit Market: గడ్డి అన్నారం ప్రూట్ మార్కెట్ వ్యాపారులకు ఊరట.. ఈనెల 4 వరకు యథాతథ స్థితి కొనసాగించాలిః హైకోర్టు
గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై హైకోర్టులో విచారణ చేపట్టింది. ఈనెల 4 వరకు యథాతథ స్థితి కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
Kothapet Fruit Market: మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన ఫ్రూట్ మార్కెట్ కనుమరుగు కాబోతోంది. గడ్డి అన్నారం మార్కెట్ బాటసింగారానికి వెళ్లి పోతోంది. మార్కెట్ ఉన్న ప్రాంతంలో అత్యాధునిక ఆసుపత్రి కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇప్పుడప్పుడే వెళ్లిపోమంటూ వ్యాపారులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఇవాళ గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై హైకోర్టులో విచారణ చేపట్టింది. ఈనెల 4 వరకు యథాతథ స్థితి కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కొత్తపేట్ మార్కెట్‌ను బాటసింగారం తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఫ్రూట్ కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. వ్యాపారులకు కల్పించిన సదుపాయాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆరా తీసింది. బాటసింగారం మార్కెట్ వద్ద తగిన సదుపాయాలు ఉన్నాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం స్పందించిన హైకోర్టు.. అక్కడి సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 4కి వాయిదా వేసింది.
హైదరాబాద్ కొత్తపేట్ ప్రాంతంలో ఉన్న పండ్ల మార్కెట్‌ను నగర శివారులోకి తరలబోతోంది. ఫ్రూట్ మార్కెట్ అంటేనే గుర్తుకు వచ్చే కొత్తపేట్ ప్రూట్ మార్కెట్ బాటసింగారానికి వెళ్లి పోతోంది. గత నెల 25వ తేదీ రాత్రి నుంచి మార్కెట్‌ను తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మార్కెటింగ్ శాఖ బాటసింగారంలో ఏర్పాట్లను పూర్తి చేసింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లలో కొద్ది రోజుల పాటు ఉండేందుకు అధికారులు సిద్ధం చేశారు. అయితే.. బాటసింగారంలో లాజిస్టిక్ పార్కులో ఈ తాత్కాలిక మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. కొత్తపేట్ మార్కెట్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయబోయే కోహెడ మార్కెట్‌లో నిర్మాణాలు ఫైనల్ దశకు చేరుకోక పోవడంతో తాత్కాలికంగా ఇబ్బందులు కలగకుండా బాటసింగారానికి తరలిస్తున్నారు.
30ఏళ్లుగా రైతులకు, కమీషన్ ఏజెంట్లకు సేవలందిస్తున్న ఈ మార్కెట్‌ను దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంతో 1986లో ఏర్పాటు చేశారు. అప్పట్లో కొత్తపేట హైదరాబాద్‌కు శివారు ప్రాంతంగా ఉండడంతో ఇక్కడ ప్రూట్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. నగరంలోని మలక్‌పేట్ మార్కెట్‌ను కొత్తపేట్‌కు తరలించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వేల కోట్ల వ్యాపారం జరిగింది.
అయితే.. హైదరాబాద్ విస్తీర్ణం ఈ 20 ఏళ్లలో అనుకున్నదానికంటే.. ఎక్కువ పెరగడంతో కొత్తపేట్ మార్కెట్‌ను కూడా తరలించడం అనివార్యం అయింది. గత సంవత్సరమే తాత్కాలిక షెడ్లు వేసి కోహెడకు తరించారు. అయితే.. గాలివాన బీభత్సానికి షెడ్లన్నీ కుప్పకూలాయి. మార్కెట్‌ను నిర్వహించడం సాధ్యకాదన్న ఆలోచనతో మళ్లీ కొత్తపేట్‌లో రన్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం తీసుకున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం నిర్ణయంతో మార్కెట్ తరలింపు తప్పడం లేదు. ఇక్కడ ఉన్న 22 ఎకరాల స్థలాన్ని మార్కెటింగ్ శాఖ వైద్య శాఖకు అలాట్ చేసింది. దీంతో ఎలాగైనా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్థానిక MLA సుధీర్‌రెడ్డి ఫ్రూట్ మార్కెట్ తరలింపు కోసం కృషి చేశారు. దాని ఫలితంగానే గడ్డిఅన్నారం మార్కెట్‌ను కోహెడకు తరలించేందుకు జీఓ విడుదలైంది. ఫ్రూట్ మార్కెట్ స్థలంలో పేద ప్రజల కోసం ప్రభుత్వం మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా కోహెడలోని 178 ఎకరాల ప్రభుత్వ భూమిలో మార్కెట్ ఏర్పాటుకు గతేడాది ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కమీషన్ ఏజెంట్ల కొర్రీతో ఫ్రూట్ మార్కెట్ షిఫ్టింగ్ డైలామాలో ఉన్నప్పటికీ.. మెజారిటీ నిర్ణయంతో తరలింపు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఫ్రూట్ మార్కెట్ కు కోహెడలో పూర్తి సౌకర్యాలు కల్పించేలా చర్యల కోసం డీపీఆర్ సిద్ధం చేసి పనులు చేస్తున్నారు. దీంతో తాత్కాలికంగా ఆస్పత్రి నిర్మాణం త్వరగా ప్రారంభించేలా మార్కెట్ ను బాటసింగారంలోని లాజిస్టిక్ కు పార్క్ కు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఫ్రూట్ మార్కెట్‌లోని కమీషన్ ఏజెంట్లు, హమాలీలు మాత్రం తరలింపుపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. తరలివెళ్లడానికి సిద్ధంగా ఉన్నామంటూనే.. కానీ బాటసింగారంలో సౌకర్యాలు కల్పించకుండా వెళ్లాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో మార్కెట్‌లో అన్ని సదుపాయాలను కల్పించిన తర్వాతే షిప్టు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ కొందరు వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈనెల 4వ తేదీ వరకు యథాతథస్థితి కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
Read Also… Telangana Assembly: పంచాయతీరాజ్ కొత్త చట్టంతో గ్రామీణ వ్యవస్థ బలోతం.. శాసనసభలో సీఎం కేసీఆర్