AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ పల్లెలకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల.. ఈ సారి ఎంతంటే..?

15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ఎదురుచూస్తున్న గ్రామాలకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. మూడో విడత నిధులను విడుదల చేసింది. దీంతో గ్రామాల్లో అభిృవృద్ధి పనులు జోరందుకోనున్నాయి. కేంద్రం ఎన్ని కోట్లు విడుదల చేసింది..? వాటిని ఏ పనులకు కేటాయించనున్నారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Telangana: తెలంగాణ పల్లెలకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల.. ఈ సారి ఎంతంటే..?
Telangana Gram Panchayats Get Rs 387 Crore
Prabhakar M
| Edited By: |

Updated on: Feb 20, 2026 | 12:53 PM

Share

15వ ఆర్థిక సంఘం కింద మూడో విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడతలో తెలంగాణ రాష్ట్రానికి రూ.387.53 కోట్లు జమయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తవడంతో పెండింగ్‌లో ఉన్న గ్రాంట్లను కేంద్రం విడుదల చేసింది. దీంతో గ్రామీణ స్థానిక సంస్థలకు కొంత ఊరట లభించింది. ఇప్పటివరకు మూడు విడతల్లో కలిపి తెలంగాణకు మొత్తం రూ.1034.42 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులు ప్రధానంగా గ్రామ పంచాయతీల సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక వసతులను మెరుగుపరచడం, తాగునీరు, పారిశుధ్యం వంటి సేవలను బలోపేతం చేయడానికి వినియోగించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీల ఎన్నికలు ఆలస్యమవడంతో 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన కొన్ని గ్రాంట్లు నిలిచిపోయాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో ఇప్పుడు విడతల వారీగా నిధుల విడుదల జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపిన ప్రకారం ఇంకా సుమారు రూ.2000 కోట్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పెండింగ్ నిధులను త్వరగా విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గ్రామీణాభివృద్ధి పనులు నిలిచిపోకుండా చూడాలని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పంచాయతీలకు తక్షణ సాయం అవసరమని రాష్ట్రం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు విడుదలైన నిధులను గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారుల మరమ్మత్తులు, పారిశుధ్య కార్యక్రమాలు, తాగునీటి సదుపాయాల విస్తరణ, అలాగే పెండింగ్ బిల్లుల చెల్లింపులకు వినియోగించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిగితే అభివృద్ధి పనులు మరింత వేగం పుంజుకుంటాయని భావిస్తున్నారు.

15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామీణ స్థానిక సంస్థలకు కీలక ఆర్థిక వనరు. పంచాయతీల స్వయం పాలన బలోపేతం, పారదర్శక ఖర్చు, గ్రామీణ మౌలిక వసతుల పెంపు లక్ష్యంగా ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. మిగిలిన నిధులు కూడా త్వరలో విడుదలైతే రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ అభివృద్ధి పనులకు మరింత ఊపు వచ్చే అవకాశముంది.

Follow Us