శవం.. హంతకుడిని పటిస్తుందా? ఇలాంటి వారేనట హత్యలు చేసేది..
అబ్బాయిలు మానసికంగా బలహీనంగా ఉండటం, అమ్మాయిని తన సొంతంగా భావించడం, దూరం అవుతున్నప్పుడు తట్టుకోలేకపోవడం వంటివి ఇలాంటి దారుణాలకు కారణమవుతాయని ఫోరెన్సిక్ మెడికల్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ నారాయణ రెడ్డి చెబుతున్నారు. దాంపత్య సంబంధాలలో బయటి వ్యక్తుల ప్రమేయం లేదా వివాహేతర సంబంధాలు కూడా నేరాలకు కారణమే..

హైదరాబాద్, మే 6: సమాజంలో పెరుగుతున్న కిరాతక నేరాలపై పలు ఆసక్తికర విషయాలను ప్రొఫెసర్ నారాయణ రెడ్డి తెలిపారు. ప్రేమ వ్యవహారాల్లో మోసాలు, శారీరక సంబంధాలు బెడిసికొట్టడం, దాన్నుండి బయటపడాలని ప్రయత్నించినప్పుడు పగ, ప్రతీకారాలు పట్టిపీడించి హత్యలకు దారితీస్తున్నాయని ప్రొఫెసర్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన శ్రద్ధా హత్య కేసు దీనికి ఒక ఉదాహరణ. రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ కాలేజ్ వద్ద జరిగిన యాసిడ్ దాడి కేసులోనూ ఇలాంటి మానసిక వైకల్యమే కనిపించిందని ఆయన గుర్తు చేశారు. అబ్బాయిలు మానసికంగా బలహీనంగా ఉండటం, అమ్మాయిని తన సొంతంగా భావించడం, దూరం అవుతున్నప్పుడు తట్టుకోలేకపోవడం వంటివి ఇలాంటి దారుణాలకు కారణమవుతాయని ఆయన వివరించారు.
దాంపత్య సంబంధాలలో బయటి వ్యక్తుల ప్రమేయం లేదా వివాహేతర సంబంధాలు కూడా నేరాలకు దారితీస్తున్నాయి. పింకీ హత్య కేసులో భర్త తన గర్భవతి అయిన భార్యను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికాడని, విడాకులకు సరైన కారణం చూపించలేక, బయటి సంబంధం కారణంగా భార్యను వదిలించుకోవాలని భావించి ఈ దారుణానికి పాల్పడ్డాడని నారాయణ రెడ్డి తెలిపారు. వైజాగ్ లో రవీందర్ అనే నేవీ ఉద్యోగి తన స్నేహితురాలు మోనికాను చంపి ముక్కలు చేసిన కేసు, గురుమూర్తి కేసులను ప్రస్తావించారు. సైనికులు లేదా నేవీలో పనిచేసే వారికి శరీరాలను ఎలా వదిలించుకోవాలో కొత్త ఆలోచనలు వస్తాయని, వారు యుద్ధ క్షేత్రంలో కాకుండా సాధారణ పనులు చేస్తున్నప్పటికీ, వారిలో ఒత్తిడి ఎక్కువై భావోద్వేగాలను తట్టుకోలేకపోతారని పేర్కొన్నారు.
డేటింగ్ యాప్‌లు వంటి పాశ్చాత్య సంస్కృతి ప్రభావం కూడా నేరాల సంఖ్యను పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లకు భిన్నంగా, సొసైటీ భయం లేకుండా స్వంత నిర్ణయాలతో జీవించే వ్యక్తులలో చిన్న గొడవలు కూడా దారుణాలకు దారితీస్తున్నాయని తెలిపారు. ఆర్థిక సమస్యలు కూడా నేరాలకు, ఆత్మహత్యలకు ముఖ్య కారణమని ప్రొఫెసర్ నారాయణ రెడ్డి అన్నారు. తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కూరుకుపోయి, అవమానాలు భరించలేక కుటుంబంతో సహా ఆత్మహత్యలకు పాల్పడే సూసైడల్ ప్యాక్ట్ కేసులను ఆయన ఉదాహరించారు. ఈ సందర్భాలలో తల్లిదండ్రులు తమ పిల్లలు అనాధలు కాకుండా, దుర్భరమైన జీవితం గడపకుండా ఉండాలనే “ప్రేమతోనే” వారిని చంపుతారని వివరించారు. మదనపల్లి, బేగంపేటలో జరిగిన కేసులను ప్రస్తావిస్తూ, సైకలాజికల్ లేదా సైకియాట్రిక్ సమస్యలు, ఒంటరితనం, ఒకే రకమైన మానసిక స్థితి కుటుంబ సభ్యులందరినీ ప్రభావితం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. నేడు మీడియా చురుకుగా ఉండటం వల్ల ఈ ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయని, ఇది కొత్త పరిణామం కాదని ఆయన తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




