ధరణిలో కొత్త ఆప్షన్… అప్లికేషన్ ఫర్ ల్యాండ్ మ్యాటర్స్ పేరుతో సమస్యల పరిష్కారానికి అవకాశం…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల నమోదును ధరణి వెబ్ సైట్ ద్వారా చేపట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల నమోదును ధరణి వెబ్ సైట్ ద్వారా చేపట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కలిగి ఉన్న వారిని తమ ఆస్తుల వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా సూచించింది. అయితే తాజాగా ధరణిలో ‘అప్లికేషన్ ఫర్ ల్యాండ్ మ్యాటర్స్’ పేరుతో కొత్త ఆప్షన్‌ను జతచేసింది.
తప్పులు సరిదిద్దుకునే అవకాశం…
రాష్ట్రప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన తర్వాత అత్యధికశాతం భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. పేర్లల్లో అక్షరదోషాలు, విస్తీర్ణం నమోదులో తేడాలు, వ్యక్తిగత భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వంటి కొన్ని సమస్యలు మిగిలిపోయాయి. తాజాగా వీటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే నిషేధిత జాబితా నుంచి తొలిగించడం, కంపెనీల భూముల రిజిస్ట్రేషన్లు వంటి కొన్ని అంశాలపై మీసేవ ద్వారా దరఖాస్తుకు అవకాశమిచ్చింది.
మార్పులు చేసుకోండిలా…
వినియోగదారులు ధరణిలో ‘యూజర్ లాగిన్’లోకి వెళ్లిన తర్వాత డ్యాష్‌బోర్డులో అప్లికేషన్ ఫర్ ల్యాండ్ మ్యాటర్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత పేరు, అడ్రస్‌వంటి వివరాలు నమోదుచేశాక.. దరఖాస్తు చేయాలనుకున్న భూమి సర్వేనంబర్‌ను నమోదుచేయాలి. అనంతరం అక్కడ కనిపించే సరిహద్దు వివాదం, విస్తీర్ణం, అటవీ సరిహద్దు వివాదం, ఇతర, పట్టాదార్ పాస్‌బుక్ (పీపీబీ)ల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ సమస్యకు సంబంధించిన వివరణను కింద బాక్స్‌లో రాయాలి. చివరగా ఏవైనా డాక్యుమెంట్లు ఉంటే అప్‌లోడ్ చేయాలి. ఈ దరఖాస్తు నేరుగా కలెక్టర్ లాగిన్‌కు వెళ్తుంది. కలెక్టర్ వాటిని పరిశీలించి.. అవసరమైతే విచారణ జరిపి వారంలో పరిష్కరించాలని ప్రభుత్వం సూచించింది.