AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: విదేశీ ఉద్యోగ కలలకు తెలంగాణ సర్కార్ అండ.. త్వరలో ‘సీఎం విదేశీ ఉద్యోగ పథకం

Telangana: మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే విదేశీ ఉద్యోగానికి అవసరమైన విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలు, భాషా పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అవసరమైతే విదేశీ భాషలలో ప్రత్యేక శిక్షణ కూడా అందించనున్నారు. విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న..

Telangana: విదేశీ ఉద్యోగ కలలకు తెలంగాణ సర్కార్ అండ.. త్వరలో ‘సీఎం విదేశీ ఉద్యోగ పథకం
Cm Overseas Employment Scheme
Prabhakar M
| Edited By: |

Updated on: Aug 03, 2026 | 1:52 PM

Share

Telangana: విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కల చాలా మంది యువతకు ఉంటుంది. కానీ ప్రయాణ ఖర్చులు, వీసా ఫీజులు, భాషా శిక్షణ వంటి వ్యయాలు ఆ కలకు అడ్డంకిగా మారుతుంటాయి. అలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువతకు చేయూత ఇవ్వాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ‘సీఎం విదేశీ ఉద్యోగ పథకం’ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పథకం ద్వారా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందే అర్హులైన యువతకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 6 వేల మంది యువతను విదేశీ ఉపాధికి పంపాలనే లక్ష్యంతో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM) సహకారంతో అమలు చేయాలని ప్రతిపాదిస్తున్నారు.

పథకం అమలులో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, మొత్తం వ్యయంలో 50 శాతం వరకు ప్రభుత్వ సబ్సిడీ అందించే విధంగా ప్రతిపాదనలు రూపొందించారు. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు స్వయంగా లేదా బ్యాంకు రుణం ద్వారా సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ సాయం ప్రధానంగా విదేశీ ప్రయాణం, వీసా ప్రక్రియ, భాషా శిక్షణ వంటి అవసరాలకు ఉపయోగపడేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. విదేశీ ఉద్యోగాల కోసం వెళ్లే దేశాలను బట్టి సబ్సిడీ మొత్తాన్ని రెండు వర్గాలుగా విభజించాలని ప్రభుత్వం భావిస్తోంది. గల్ఫ్ దేశాలు, సింగపూర్, మలేషియా, ఫిజీ, మారిషస్, ఇజ్రాయెల్ వంటి దేశాలకు వెళ్లే వారికి గరిష్టంగా రూ.50 వేల వరకు ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉంది.

అదే జర్మనీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు ఇతర యూరోపియన్ దేశాలకు వెళ్లే అభ్యర్థులకు భాషా శిక్షణ, వీసా, ప్రయాణ ఖర్చుల కోసం గరిష్టంగా రూ.1.75 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ దేశాల్లో ఆరోగ్య రంగం, నిర్మాణ రంగం, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో నైపుణ్యం కలిగిన సిబ్బందికి మంచి డిమాండ్ ఉండటంతో ఈ సహాయం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. తెలంగాణకు చెందిన స్థానికులై ఉండటంతో పాటు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, ఆధార్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వంటి పత్రాలు తప్పనిసరిగా ఉండనున్నాయి. ప్రతి కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అవకాశం కల్పించేలా నిబంధనలు రూపొందిస్తున్నారు.

మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే విదేశీ ఉద్యోగానికి అవసరమైన విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలు, భాషా పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అవసరమైతే విదేశీ భాషలలో ప్రత్యేక శిక్షణ కూడా అందించనున్నారు. విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ పథకంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకురానున్నారు. దరఖాస్తు నుంచి ఎంపిక వరకు మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో అధికారులు పత్రాలను పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయి ధృవీకరణ చేపట్టి, రాష్ట్ర స్థాయి కమిటీ తుది ఆమోదం ఇవ్వనుంది.

ప్రభుత్వ సబ్సిడీని ముందుగానే చెల్లించకుండా, అభ్యర్థి నిజంగా విదేశాల్లో ఉద్యోగంలో చేరినట్లు నిర్ధారణ అయిన తర్వాతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేసే విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నిధుల రికవరీ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యంతో కూడిన మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా జర్మనీ, జపాన్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో భారీగా ఉన్న ఉద్యోగ అవకాశాలను రాష్ట్ర యువతకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ఉద్దేశంగా పేర్కొంటున్నారు. ప్రభుత్వం అధికారికంగా పథకాన్ని ప్రకటించిన తర్వాత పూర్తి మార్గదర్శకాలు, దరఖాస్తు ప్రక్రియ, అమలు తేదీలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us