AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి కోటా పెంపు.. రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం అందిస్తోంది. ఈ పథకంపై ప్రభుత్వం మరో ప్రకటన చేసింది.

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి కోటా పెంపు.. రేవంత్ కీలక ఆదేశాలు
Indiramma Houses Scheme
Venkatrao Lella
|

Updated on: Apr 14, 2026 | 8:52 AM

Share

ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివాసీలు, గిరిజనులకు ఈ పథకం అమలుకు సంబంధించి సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. వారికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు పెంచుతామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో అర్హులైనవారికి అదనపు ఇళ్లను కేటాయిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇళ్ల కోటాను మరింత పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు రేవంత్ తెలిపారు. దీని వల్ల ఆయా ప్రాంతాల్లో ఎక్కువమంది పేదలు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కలను సాకారం చేసుకునే అవకాశం లభించనుందని చెప్పవచ్చు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రేవంత్ స్పష్టం చేశారు. ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేక భేటీ

తెలంగాణ గిరిజనాభివృద్ది మంత్రి సీతక్క ఆధ్వర్యంలో గిరిజన, ఆదివాసీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. ఆదివాసీ, గిరిజనుల అభివృద్దిపై ఈ సందర్భంగా చర్చించారు. ఆయా వర్గాలకు అందుతున్న సంక్షేమ పథకాలు, ప్రత్యేక నిధులపై పలు కీలక ప్రతిపాదలను రేవంత్ దృష్టికి ఎమ్మెల్యేల బృందం తీసుకెళ్లింది. దీంతో రేవంత్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గిరిజన, ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజనులు, ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, వారి కోటా పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ వర్గాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.

సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ఇక గిరిజనులు, ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూముల్లో బోర్డు వేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యేలు రేవంత్‌ను కోరారు. దీంతో రేవంత్ సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ ప్రాంతాల్లో అటవీశాఖ నిబంధనల వల్ల రోడ్ల మరమ్మత్తులకు అనుమతులు రావడం లేదని ఎమ్మెల్యేలు తెలిపారు. అలాగే కొత్తగా నిర్మించాలనుకున్న రోడ్లకు కూడా అనుమతులు రావడం క్లిష్టతరంగా మారిందన్నారు. దీంతో కొత్త రోడ్ల నిర్మాణంపై వేగంగా చర్యలు చేపట్టాలని అటవీశాఖకు సూచించారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టాలని అధికారులకు రేవంత్ సూచించారు. దీని వల్ల తాగునీరు, సాగునీటి సమస్య తీరుతుందన్నారు. అటవీశాఖ నుంచ చెక్ డ్యాంలకు వీలైనంత త్వరగా అనుమతులు వచ్చేలా అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టాలని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.

Follow Us