Ramdan Thofa: కరోనా కష్టకాలంలో పేద ముస్లింలకు రాష్ట్ర సర్కార్ అండ.. రంజాన్ తోఫా పంపిణీ ప్రారంభించిన మహమూద్ అలీ
పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని.. పేద ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్‌లు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
TS Government Ramadan Eid Thofa: కరోనా కష్ట కాలంలోనూ పేద ముస్లింలకు అండగా నిలిచేందుక ముందుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని.. పేద ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్‌లు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాంపల్లిలోని హజ్ హౌస్ నుంచి మసీద్‌లకు గిఫ్ట్ ప్యాక్స్ తీసుకెళ్తున్న వాహనాలను సోమవారం రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీమ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పథకాన్ని తెలంగాణ వక్ఫ్ బోర్డు పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 815 మసీదుల ద్వారా 4.5 లక్షల గిఫ్ట్ ప్యాక్‌లను ముస్లిం కుటుంబాలకు అందజేయనున్నట్లు హోంమంత్రి మమమూద్ అలీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంముస్లింలకు ఏటా దుస్తులు, ఇతర వస్తువులతో కూడిన రంజాన్ తోఫాను అందజేసినట్టే ఈ ఏడాది కూడా ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలను గుర్తించి గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేయనున్నారు, ఇందులో భాగంగా ప్రతి మసీద్ ఆధ్వర్యంలో 500 గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేయనున్నారు. వీటిని ఆ మసీద్‌లో ఏర్పాటు చేసిన కమిటీ పర్యవేక్షించనుంది. ఈ పంపిణీ కార్యక్రమంలో ఒక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నాలుగు మసీదులు, కార్పొరేటర్ ఆధ్వర్యంలో రెండు మసీదులు ఉండేలా నిర్ణయించారు. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు వక్ఫ్ బోర్డు చైర్మన్‌ను హోం మంత్రి మహమూద్ అలీ అభినందించారు.
ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వ్యక్తిగతంగా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. రంజాన్ తోఫాలు అందజేస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు లౌకికత్వానికి మారుపేరుగా నిలుస్తున్నారని అన్నారు. కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కాగా, గతేడాది కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ తోఫాను పంపిణీ నిలిపివేసింది. కానీ, ఈ ఏడాది యధావిథిగా రంజాన్ గిఫ్టులను పంపిణీ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అందిస్తున్నట్లు మంత్రి మహమూద్ అలీ తెలిపారు.