బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భద్రత కుదిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి దాదాపు తొమ్మిదిన్నర ఏళ్ల పాటూ ఏకఛత్రాధిపత్యంగా పాలించారు. తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించారు. గతంలో కేసీఆర్ కు జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉండేది. అయితే ప్రస్తుతం దీనిని వై కేటగిరీగా కుదించారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి 4+4 గన్ మెన్లతో పాటూ ఎస్కార్ట్ వాహనం అందుబాటులో ఉండనుంది. అలాగే ఇంటి ముందు సెంట్రీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటూ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్లను తొలగించింది. ఇటీవల రాష్ట్ర పరిధిలోని అన్ని కార్పోరేషన్ చైర్మెన్ ల పోస్టులను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా కార్పొరేషన్ చైర్మెన్లకు గన్ మెన్లను కూడా తొలగిస్తూ కాంగ్రెస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న మాజీ మంత్రులకు 2+2 గన్ మెన్లను కేటాయించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రత ఎవరికి అవసరం అనేదానిపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు అధికారులు. ఇంటెలిజెన్స్ అధికారుల సూచనల మేరకు గన్మెన్లను పోలీసు శాఖ కేటాయించనుంది . అయితే అక్బరుద్దీన్, రాజాసింగ్ కు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన భద్రతను గతంలో లాగానే యధావిధిగా కొనసాగిస్తోంది.
ఇదిలా ఉంటే మాజీ సీఎం కేసీఆర్ గత వారం రోజులుగా సోమాజిగూడ యశోదా ఆసుత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఆయన ఎడమ కాలి తుంటి ఎముక విరగడంతో ప్రత్యేక వైద్య బృందం శస్త్ర చికిత్స చేశారు. కేసీఆర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు యశోదా ఆసుపత్రిలో పరామర్శించారు. ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం కేసీఆర్‌ను బంజారాహిల్స్ నందినగర్‌లోని నివాసానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. అయితే ఎనిమిది వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..