
జూనియర్ పంచాయతీ సెక్రెటరీల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. సమ్మెలో పాల్గొంటున్న పంచాయతీ సెక్రెటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమ్మె విరమించి.. రేపు (మంగళవారం) సాయంత్రం ఐదు గంటల్లోగా విధుల్లో చేరాలని నోటీసుల్లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. విధుల్లో చేరకుంటే జూనియర్ పంచాయతీ సెక్రెటరీలను శాశ్వతంగా తప్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా.. సోమవారం సాయంత్రం నోటీసులు జారీ చేశారు. కాగా, రాష్ట్రంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు.. తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 29 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యదర్శులతో చర్చలు జరిపారు. విధుల్లో చేరాలని.. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని వివరించారు. అయినప్పటికీ.. కార్యదర్శులు క్రమబద్ధీకరణ చేయాల్సిందేనని పట్టుపట్టారు.
జూనియర్ పంచాయతీ సెక్రెటరీల సమస్యపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం సెక్రెటరీల సమస్యపై మంత్రి సీఎం కేసీఆర్‌ను కలిసి వివరించారు. విధుల్లో చేరకపోతే.. తదుపరి పరిణామాలు, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం ప్రభుత్వం సమ్మె విరమించి విధుల్లో చేరాలని పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..