పోటీ పక్క రాష్ట్రాలతో కాదు.. ప్రపంచ దేశాలతో.. గ్లోబల్ సమ్మిట్‌కి సర్వం సిద్ధం!
మా పోటీ పక్క రాష్ట్రాలతో కాదు.. ప్రపంచ దేశాలతో అంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. గ్లోబల్ సమ్మిట్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సమ్మిట్ ద్వారా 2047నాటికి 3 ఫైనాన్షియల్ మెగా-గోల్స్ సాధించే లక్ష్యంగా ముందుకెళ్తోంది రేవంత్ ప్రభుత్వం. సమ్మిట్ ద్వారా 3 ఫైనాన్షియల్ మెగా-గోల్స్ సాధించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మా పోటీ పక్క రాష్ట్రాలతో కాదు.. ప్రపంచ దేశాలతో అంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. గ్లోబల్ సమ్మిట్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సమ్మిట్ ద్వారా 2047నాటికి 3 ఫైనాన్షియల్ మెగా-గోల్స్ సాధించే లక్ష్యంగా ముందుకెళ్తోంది రేవంత్ ప్రభుత్వం.
ఊపిరి ఉన్నంతవరకు తెలంగాణ రైజింగ్‌కు తిరుగుండదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల ఆశీర్వాదమే తన ఆయుధమన్నారు. నిన్నటి వరకు ఒక లెక్క, సమ్మిట్ తర్వాత మరో లెక్క అన్నారు. ఫ్యూచర్ సిటీ తెలంగాణ ప్రగతికి వేగుచుక్క అని పేర్కొన్నారు. గత పాలకులు కలలోనూ ఊహించని విజన్‌కు ప్రాణం పోశామని.. దేశ గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణను మారుస్తామన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్ లో ట్వీట్ చేశారు.
జాతి కోసం… జనహితం కోసం… గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలి… గొప్ప కార్యాలు చేయాలంటే… మహా సంకల్పం కావాలి…
సరిగ్గా రెండేళ్ల క్రితం నాకు ఆ ధైర్యం ఇచ్చి… తమ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చి… నిండు మనస్సుతో ఆశీర్వదించిన తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
— Revanth Reddy (@revanth_anumula) December 7, 2025
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘తెలంగాణ రైజింగ్ సమ్మిట్’ 2025 ద్వారా తన విజన్‌ను ప్రపంచానికి తెలియజెప్పే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. 2047 నాటికి దేశ స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల్లోకి అడుగుపెట్టనుంది. ఈ సమ్మిట్ ద్వారా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎలా చేరుకోనుందో అన్న రోడ్‌మ్యాప్‌ను ప్రభుత్వం ప్రకటించనుంది.
ఫ్యూచర్ సిటీ వేదికగా డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న మెగా ఈవెంట్ నిర్వహణకు 100 ఎకరాల్లో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025కు 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు వస్తున్నారు. సదస్సుకు హాజరవుతున్న వారిలో నోబెల్ గ్రహీతలు, ఆర్థికవేత్తలు, దేశ, విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు ఉన్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, కేంద్రమంత్రులను రాష్ట్ర బృందాలు ఆహ్వానించాయి. అలాగే.. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది.
గ్లోబల్ సమ్మిట్ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో వేదికలు సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌ను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2:30కి గ్లోబల్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య ప్రముఖులతో వివిధ అంశాలపై చర్చాగోష్టి నిర్వహిస్తారు. డిసెంబర్ 9వ తేదీన సాయంత్రం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ విజన్ డాక్యుమెంట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించనుంది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్‌ను ప్రభుత్వం ప్రకటించనుంది.
ఈ క్రమంలోనే నీతి ఆయోగ్, ISB సూచనలతో విజన్ డాక్యుమెంట్ తుది మెరుగులు దిద్దారు. రెండు రోజుల సమ్మిట్‌లో 27 ప్రత్యేక సెషన్లలో టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఎనర్జీ, ఆర్థిక అభివృద్ధి వంటి 15 ప్రధాన రంగాల్లో చర్చలు నిర్వహిస్తారు. సమ్మిట్ కోసం 50 ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు. పార్కింగ్ ప్లేస్ నుంచి సమ్మిట్‌కి12 ఎలక్ట్రిక్ బస్సుల్లో డెలిగేట్స్‌ను తరలిస్తారు. 6 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. వెయ్యి సీసీ కెమెరాలు, డ్రోన్లతో సమ్మిట్ చుట్టూ నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇండిగో సంక్షోభంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అవసరమైతే సమ్మిట్‌కు వచ్చే అతిథుల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తోంది.
సమ్మిట్ ద్వారా 3 ఫైనాన్షియల్ మెగా-గోల్స్ సాధించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.1. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ, భారత జీడీపీలో 10% వాటా, 2. 2047 నాటికి తెలంగాణాను నెట్ జీరో రాష్ట్రంగా తీర్చిదిద్దడం, 3. కోటి మంది తెలంగాణ మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం. మానవ వనరుల అభివృద్ధి, ఉత్పాదకత, ఆవిష్కరణ, పెట్టుబడులు, పొదుపులను మూడు స్తంభాలుగా చేసుకుని ఈ లక్ష్యాలను సాధించే దిశగా రాష్ట్రప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. 6 వేల మంది పోలీసులతో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామని.. డెలిగేట్స్‌కు పైలట్ వాహనాలను సిద్ధం చేశామని వివరించారు. సమ్మిట్ జరిగి రోజుల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ఇక గ్లోబల్ సమ్మిట్‌కు 50 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. విజిటర్స్ కోసం 10 ప్రాంతాల నుంచి బస్సులు నడిపించబోతున్నామని వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




