Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: అసెంబ్లీలో అడుగు పెట్టాలనే తాపత్రయంతో సై అంటే సై అంటున్న మహిళా అభ్యర్థులు

తెలంగాణ శాసన సభ సంగ్రామంలో అక్కడ నారీమణులు సై అంటే సై అంటున్నారు. కొందరు రాజకీయ ఉద్దండులపై కదనరంగంలో కాలు దువ్వుతుంటే మరికొందరు ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల నుండి టిక్కెట్ దక్కించుకున్న మహిళలు సరిలేరు మాకెవ్వరు అన్నట్లు ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నారీ భేరిపై స్పెషల్ స్టోరీ..!

Telangana Election: అసెంబ్లీలో అడుగు పెట్టాలనే తాపత్రయంతో సై అంటే సై అంటున్న మహిళా అభ్యర్థులు
Women Power In Election
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Nov 21, 2023 | 7:46 PM

తెలంగాణ శాసన సభ సంగ్రామంలో అక్కడ నారీమణులు సై అంటే సై అంటున్నారు. కొందరు రాజకీయ ఉద్దండులపై కదనరంగంలో కాలు దువ్వుతుంటే మరికొందరు ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల నుండి టిక్కెట్ దక్కించుకున్న మహిళలు సరిలేరు మాకెవ్వరు అన్నట్లు ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నారీ భేరిపై స్పెషల్ స్టోరీ..!

ఆకాశంలో సగం.. అవకాశంలో సగం అంటూ దూసుకుపోతున్నారు మహిళామణులు. విద్యా, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏ రంగంలోనైనా ముందుంటున్నారు నారీమణులు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 215 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో 27 మంది మహిళలు రంగంలోకి దిగగా 188 మంది పురుషులు పోటీ పడుతున్నారు. వీరిలో కాంగ్రెస్, బీజేపీ, BRS అయిన మూడు ప్రధాన రాజకీయ పార్టీల నుండి ఎనిమిది మంది మహిళలు అసెంబ్లీలో అడుగు పెట్టాలనే తాపత్రయంతో రణరంగంలోకి దిగారు.

అసెంబ్లీ బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ములుగు నుండి సీతక్క, వరంగల్ తూర్పు నుండి కొండా సురేఖ, స్టేషన్ ఘనపూర్ నుండి సింగపురం ఇందిరా, పాలకుర్తి నుండి యశస్వినీ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుండి ముగ్గురు, BRS నుండి ఒక్కరూ ప్రచారంలో వారి సత్తా చాటుతున్నారు. వారిలో BRS పార్టీ ములుగు నియోజకవర్గ అభ్యర్థిగా బడే నాగజ్యోతి పోటీ చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ బీజేపీ అభ్యర్థిగా రావు పద్మా అమరేందర్ రెడ్డి, భూపాలపల్లి బీజేపీ అభ్యర్థిగా కీర్తిరెడ్డి, డోర్నకల్ అభ్యర్థిగా సంగీత సమరం లోకి దిగారు.

పురుషులతో పోల్చుకుంటే మహిళలు అత్యల్పంగా పోటీ పడుతున్నప్పటికీ విజయంపై ధీమాతో ఉన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి మొత్తం 29 మంది పోటీ చేస్తుండగా వీరిలో ఆరుగురు మహిళలు, ఒకరు ట్రాన్స్ జెండర్ పోటీ చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి 15 మంది బరిలో నిలువగా వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పరకాల నుండి 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కానీ ఇక్కడ అంతా పురుషులే. వర్దన్నపేట నియోజకవర్గం నుండి 14మంది పోటీ చేస్తుండగా ఇక్కడి ఇద్దరు మహిళలు బరిలో నిలిచారు.

భూపాలపల్లి నుండి 23 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా వీరిలో ఐదుగురు మహిళా అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ములుగు నుండి 11 మంది రంగం లోకి దిగగా వీరిలో ముగ్గురు మహిళలు పోటీ పడుతున్నారు. మహబూబాబాద్ నియోజకవర్గం నుండి 12 మంది బరిలోకి దిగగా, వీరిలో ఒక్కరు మాత్రమే మహిళా అభ్యర్థి ఉన్నారు. డోర్నకల్ నుండి 14 మంది పోటీ చేస్తుండగా వీరిలో ఇద్దరు మహిళలు రంగంలోకి దిగారు. పాలకుర్తి నియోజకవర్గం నుండి 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, ఇక్కడ ఒక్కరు మాత్రమే మహిళా అభ్యర్థి ఉన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుండి 19 మంది పోటీ చేస్తుండగా, వీరిలో ముగ్గురు మహిళలు పోటీ పడుతున్నారు..

అసెంబ్లీ ఎన్నికల బరిలో పురుష ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, పోటీ చేస్తున్న మహిళలు మాత్రం అసెంబ్లీ లో అడుగు పెట్టాలనే తాపత్రయంతో సై అంటే సై అంటున్నారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…