AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Komatireddy Venkat Reddy: నల్గొండ బరిలో కోమటిరెడ్డి.. సీఎం కల నెరవేరేనా..?

Komatireddy Venkat Reddy Telangana Election 2023: తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ మోస్ట్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. గ‌త తెలంగాణ శాస‌న‌స‌భ‌లో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా పని చేసిన ఆయన.. ఎలాంటి సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య, కంటి చికిత్స క్యాంపులతో పాటు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసి పేదలకు అండగా నిలిచారు.

Komatireddy Venkat Reddy: నల్గొండ బరిలో కోమటిరెడ్డి.. సీఎం కల నెరవేరేనా..?
Komatireddy Venkat Reddy
Ravi Kiran
|

Updated on: Dec 02, 2023 | 8:52 AM

Share

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ మోస్ట్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. గ‌త తెలంగాణ శాస‌న‌స‌భ‌లో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా పని చేసిన ఆయన.. ఎలాంటి సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య, కంటి చికిత్స క్యాంపులతో పాటు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసి పేదలకు అండగా నిలిచారు. విద్యార్ధి దశ నుంచి రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. యువజన కాంగ్రెస్‌లో చేరడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. న‌ల్గొండ శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన వెంకట్ రెడ్డి.. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎన్నికలు 2023లో కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. మరోవైపు 2011 డిసెంబర్ 20న హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదానికి గురైన తన కుమారుడు ప్రతీక్ రెడ్డి జ్ఞాపకార్థం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ స్థాపించారు. ఫౌండేషన్ ద్వారా రూ. 3.5 కోట్ల వ్యయంతో, ఆయన నల్గొండలో ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, బాలికల కోసం ఒకేషనల్ జూనియర్ కళాశాల భవనాలను నిర్మించారు. అలాగే ఈ ట్రస్ట్ ద్వారా అంబులెన్స్ సేవలను సైతం నిర్వహిస్తున్నారు.

విద్యాభ్యాసం ఇలా..

హైదరాబాద్‌లోని మ‌ల‌క్‌పేట‌ పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠ‌శాలలో పదో తరగతి, ప‌త్తర్‌ఘ‌ట్టీలోని ఎన్‌.బీ.సైన్స్ కాలేజీలో ఇంట‌ర్మీడియ‌ట్, చైత‌న్య భార‌తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ నుంచి ఇంజినీరింగ్ పట్టాను అందుకున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

రాజకీయ జీవితం ఇలా..

న‌ల్గొండ శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1999, 2004, 2009, 2014లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అలాగే వై.ఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐటీ శాఖ మంత్రిగా ప‌ని చేశారు. ఇక తెలంగాణ ఉద్యమం వేళ 2010లో ఒక‌సారి, 2011 అక్టోబ‌ర్‌లో రెండోసారి ఆయ‌న త‌న శాస‌న‌స‌భ స‌భ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ ఈ రెండుసార్లు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన రాజీనామాలను తిరస్కరించింది. 2011, నవంబర్ 1 నుంచి తొమ్మిది రోజుఅల పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేపట్టారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇది ఆయన రాజకీయ జీవితంలో ప్రత్యేక ఘట్టం అని చెప్పొచ్చు. అటు 2019లో మళ్లీ భువనగిరి నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

ఇదిలా ఉండగా.. ఇటీవల కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశాయి. ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తలుచుకుంటే.. తనను సీఎం చేస్తారని వెంకట్‌రెడ్డి ఒకానొక సందర్భంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తానే సీఎం అంటే.. తానే సీఎం అని సీనియర్ నేతలంటూ చెప్పుకుంటున్న వేళ.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో మరో రాజకీయ చర్చకు కేరాఫ్ అయ్యారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోంది: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, 80 స్థానాలను గెలుచుకుని అధికారంలోకి రావడం ఖాయమన్నారు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, ఆ పార్టీ నల్గొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. అలాగే నల్గొండలో మరోసారి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందటం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి.

మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం..