Telangana Minister: త్వరలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..
Telangana Minister: తెలంగాణలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్న నేపథ్యంలో మంగళవారం నాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి..

Telangana Minister: తెలంగాణలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్న నేపథ్యంలో మంగళవారం నాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రారంభించేందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యా సంస్థలను ప్రారంభించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ యాజమాన్యాలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. ఈ నెల 25వ తేదీ నాటికి పాఠశాలలు, కళాశాలల్లో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి సబతి ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఇక 9, 10, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల తరగతుల నిర్వహణపై ఈ నెల 20వ తేదీలోగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లాల్లోని విద్యా సంస్థల పూర్తిస్థాయి నివేదికలను జిల్లా కలెక్టర్ల ద్వారా రూపొందించాలని సూచించారు.
అలాగే విద్యా సంస్థల్లో భోజన సదుపాయాలు జిల్లా కలెక్టర్లు సమకూరుస్తారని మంత్రి తెలిపారు. విద్యాశాఖాధికారులు అన్ని పాఠశాలలను ప్రత్యక్షంగా పరిశీలించి పాఠశాలలను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. వివిధ సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు, కళాశాలలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసేందుకు ఈ నెల 18వ తేదీన ఆయా శాఖల మంత్రులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు మంత్రి సబిత తెలిపారు. ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రైవేట్ విద్యా సంస్థలు నడుచుకునేలా ఈనెల 19వ తేదీన ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా కోర్సుల యాజమాన్య కమిటీలతో కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలిపారు. 9, 10, ఇంటర్, డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం క్యాలెండర్లను విడుదల చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. కాగా, మంత్రితో సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రాంచంద్రన్, టెక్నికల్ ఎడ్యూకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉమర్ జలీల్, దేవసేన తదితరులు పాల్గొన్నారు.
Also read:




