AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా మీ ఖాతాల్లోకే డబ్బులు.. ఇదిగో కోత్త రూల్స్

తెలంగాణలోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే జమ చేసేలా సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. విద్యాశాఖ డేటాతో ఈ-పాస్ పోర్టల్‌ను అనుసంధానిస్తూ, మరింత పారదర్శకంగా, వేగంగా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రభుత్వం

Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా మీ ఖాతాల్లోకే డబ్బులు.. ఇదిగో కోత్త రూల్స్
Ts Fee Reimbursement New Rules 2026
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jun 06, 2026 | 7:00 AM

Share

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల పంపిణీ విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అర్హులైన విద్యార్థుల ఖాతాల్లోకే నేరుగా నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం ఫీజుల చెల్లింపులు ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు దరఖాస్తు ఆమోదం పొందిన నెల రోజుల్లోనే ఫీజులు, ఉపకారవేతనాలు విడుదల చేసే విధానాన్ని తీసుకురానున్నారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన ఫీజు మొత్తాన్ని విద్యార్థులు వారం రోజుల్లోగా సంబంధిత కళాశాలకు చెల్లించాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఆ మొత్తాన్ని విద్యార్థి నుంచి తిరిగి వసూలు చేసే నిబంధనను కూడా అమలు చేయనున్నారు.

ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ కార్డు, విద్యా రికార్డుల్లోని పేరు ఒకే విధంగా ఉండాలి. అలాగే ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఆధార్ ధ్రువీకరణ, కాలేజీ డిజిటల్ సిగ్నేచర్, జిల్లా సంక్షేమాధికారి ఆమోదం పూర్తయిన తర్వాతే నిధులు విడుదల కానున్నాయి. ఫీజులు, స్కాలర్‌షిప్‌ల పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా మార్చేందుకు ఈ-పాస్ పోర్టల్‌ను విద్యాశాఖ డేటాతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల విద్యార్థుల ప్రవేశ వివరాలు, అర్హత సమాచారం నేరుగా అందుబాటులోకి వచ్చి దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది.

ఇక నిధుల కొరత కారణంగా బకాయిలు పేరుకుపోకుండా ప్రతి నెలా సుమారు రూ.200 కోట్లను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యా సంవత్సరం పూర్తయ్యేలోపు ఫీజులు, స్కాలర్‌షిప్‌లన్నీ చెల్లించేలా కార్యాచరణ రూపొందిస్తోంది. అయితే ఈ సదుపాయాలను పొందేందుకు విద్యార్థులు కనీసం 70 శాతం హాజరు నమోదు చేయడం తప్పనిసరి చేసింది.

సంక్షేమ శాఖలతో జరిగిన చర్చల అనంతరం ఈ ప్రతిపాదనలకు రూపురేఖలు ఖరారయ్యాయి. సంబంధిత దస్త్రానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆమోదం తెలపగా, త్వరలో సీఎం, డిప్యూటీ సీఎం ఆమోదం అనంతరం అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. దీంతో వేలాది మంది విద్యార్థులకు ఫీజుల భారం తగ్గడమే కాకుండా, స్కాలర్‌షిప్‌లు కూడా సకాలంలో అందే అవకాశం ఏర్పడనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us