Telangana Congress: జంబో కమిటీ కారణంగా గుర్రుమంటున్న టీ-కాంగ్రెస్ సీనియర్లు.. నేతల మధ్య ఐక్యత దెబ్బతీసేలా ఉందన్న భట్టి..

|

Dec 14, 2022 | 7:21 AM

గత కొన్నేళ్లుగా సైలెంట్ మోడ్‌లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పుడు ఒక్కసారిగా వైలెంట్ మోడ్‌లోకి వచ్చేశారు. తాజాగా విడుదలైన కాంగ్రెస్ జంబో కమిటీ కారణంగా పార్టీ నాయకులలో ఒక్కసారిగా అగ్గి రాజుకుంది.

Telangana Congress: జంబో కమిటీ కారణంగా గుర్రుమంటున్న టీ-కాంగ్రెస్ సీనియర్లు.. నేతల మధ్య ఐక్యత దెబ్బతీసేలా ఉందన్న భట్టి..
Telangana Congress
Follow us on

గత కొన్నేళ్లుగా సైలెంట్ మోడ్‌లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పుడు ఒక్కసారిగా వైలెంట్ మోడ్‌లోకి వచ్చేశారు. తాజాగా విడుదలైన కాంగ్రెస్ జంబో కమిటీ కారణంగా పార్టీ నాయకులలో ఒక్కసారిగా అగ్గి రాజుకుంది. ఇంతకీ ఈ కమిటీపై కాంగ్రెస్ సీనియర్ల కంప్లయింట్ ఏమిటి..? హైకమాండ్‌నే టార్గెట్ చేసేలా వారు ఎందుకు మాట్లాడుతున్నారు.? కాంగ్రెస్ హైకమాండ్ ఒకటి తలిస్తే కార్యకర్తలు మరొకటి తలిచినట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏకంగా 84 మంది జనరల్ సెక్రటరీలను నియమించడం వల్ల వీలైనంత ఎక్కువ మంది సంతోషిస్తారని పార్టీ అధిష్టానం భావిస్తే.. అది కాస్తా అసలుకే మోసం వచ్చినట్లుగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీనియర్ నాయకుడు దామోదర రాజనరసింహ మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అంటే ఓ పదిహేను మంది మాత్రమే ఉండేవారు. వారు కూడా.. సూపర్ సీనియర్లే అయ్యుండేవారు. కానీ ఇప్పుడు..? ఆర్నెల్ల క్రితం పార్టీలోకి వచ్చిన వారికి కూడా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవిని కట్టబెట్టేస్తున్నారు. పది- పదిహేనేళ్ల నుంచీ కాంగ్రెస్‌‌కు నమ్మకంగా ఉంటున్న వారికి పార్టీ అధిష్టానం మొండి చేయి చూపిస్తోంది. ఇదెక్కడి లెక్క..? దీన్ని ఎలా తీసుకోవాలి..?’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్‌లో కేవలం ఇదొక్కటే సమస్య కాదు.. ఇంకా చాలా సమస్యలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. PACలో చోటు దక్కలేదని కొందరు.. కొత్తవారిని సీనియర్లను ఒకే విధంగా ట్రీట్ చేశారని ఇంకొందరు..CLPకి సమాచారం ఇవ్వరా అంటూ మరికొందరు.. ఇలా రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఒకప్పట్లో పీసీసీ, సీఎల్పీ పదవులు జోడెద్దుల్లా సమాన హోదా కలిగి ఉండేవి. కానీ ఇప్పటి పరిస్థితి అలా లేదు. ఎవరికి వారే యుమనా తీరే అన్నట్టుగా పార్టీ తయారైంది. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఐక్యతను పూర్తిగా దెబ్బ తీసేది ఉందని’’ తన అభిప్రాయాన్ని తెలియపరిచారు. ‘‘ జనరల్ సెక్రటరీల నియామకంపై పార్టీలో ఒక సమగ్రమైన పరిశీలన జరగలేదు. సామాజిక న్యాయం కూడా పాటించలేదు. అందరి అభిప్రాయాల సేకరణ తీసుకోకుండా ఇష్టానుసారం నిర్ణయాన్ని తీసుకున్నారు’’ అని కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లు రవి పేర్కొన్నారు.

కాగా తాము ఏదో ఊహిస్తే.. ఇంకేదో  అయ్యిందని.. ఈ విషయంలో తాము తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయిన్నట్టుగా కాంగ్రెస్‌లోని కొందరు లీడర్లు చెబుతున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న లీడర్లు కూడా ఇప్పుడు బలంగా గళం విప్పుతున్నారు. ఎప్పుడూ హైకమాండ్‌ను వెనకేసుకొచ్చే నేతలు కూడా ఢిల్లీపెద్దలపై మాటల తూటాలను సంధిస్తున్నారు. పార్టీలో రాజుకుంటున్న అసమ్మతి తీవ్రతను ఈ పరిణామాలు కచ్చితంగా అద్దం పట్టేవే అని చెప్పుకోవాలి. మరి కమిటీల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా..? సీనియర్లను బుజ్జగించే ప్రయత్నాలు మొదలవుతాయా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం