PROTOCOL ISSUE: ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నో ఎంట్రీ.. ఓడిన కాంగ్రెస్ అభ్యర్ధులే ఇన్‌ఛార్జ్‌లు..!
తెలంగాణలో ప్రోటోకాల్ రగడ రగులుతోంది. గెలిచిన ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా.. ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధులతో అధికారిక కార్యక్రమాలు చేసేస్తున్నారు. నిజానికి ఇదేం కొత్త సంప్రదాయం కాదు. గత ప్రభుత్వాలు చేసినవే. అందుకే, నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షా అంటూ బీఆర్ఎస్‌ను కామెంట్ చేస్తోంది కాంగ్రెస్.

తెలంగాణలో ప్రోటోకాల్ రగడ రగులుతోంది. గెలిచిన ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా.. ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధులతో అధికారిక కార్యక్రమాలు చేసేస్తున్నారు. నిజానికి ఇదేం కొత్త సంప్రదాయం కాదు. గత ప్రభుత్వాలు చేసినవే. అందుకే, నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షా అంటూ బీఆర్ఎస్‌ను కామెంట్ చేస్తోంది కాంగ్రెస్. ఇంతకీ, మార్పు కావాలనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ సంప్రదాయాన్ని మారుస్తుందా? ప్రోటోకాల్ పాటిస్తుందా?
ప్రోటోకాల్ అనేది ఒకటుంటుంది. అధికారిక కార్యక్రమాలైనా, అభివృద్ధి-సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలకైనా ఎమ్మెల్యేకు మొదట ప్రాధాన్యత ఉంటుంది. అది ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే. కానీ, కొంతకాలంగా ఆ సంప్రదాయాన్ని పాటించడం లేదు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను కాదని, ఓడించిన అభ్యర్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలైంది. కేవలం తెలంగాణలోనే అనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ.. తమకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని నిత్యం విమర్శలు చేస్తూ వచ్చింది. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రోటోకాల్ ఇవ్వరా అంటూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చివరికి గవర్నర్ కూడా తనకు ప్రోటోకాల్ ఇవ్వడంలేదంటూ చెప్పుకునే పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మారింది కాబట్టి.. ఈ ప్రోటోకాల్ విషయంలోనూ మార్పు ఉంటుందనుకున్నారు. కాని, సీఎం రేవంత్‌రెడ్డి ఒకే మాటతో తేల్చి చెప్పేశారంటున్నారు. గాంధీ భవన్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో.. ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిన కాంగ్రెస్ అభ్యర్ధులే ఆ నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తారని చెప్పారంటున్నారు. ఆ ఒక్క మాటతో స్థానిక ఎమ్మెల్యేను కాదని, కాంగ్రెస్ నేతలే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కొడంగల్ నియోజకవర్గంలో దౌల్తాబాద్, కొడంగల్, బొంరాస్‌పేట్ మండలాల ప్రజాపాలన రివ్యూ మీటింగ్ జరిగింది. ఇలాంటి ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి ఎలాంటి పదవి లేని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి హాజరయ్యారు. దీనిపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నిలదీశారు. ఏ హోదాలో తిరుపతిరెడ్డిని స్టేజ్‌పై కూర్చోబెట్టారని ప్రశ్నించారు.
తాజాగా ప్రజా పాలన కార్యక్రమంపై ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే, స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు ప్రోటోకాల్ ఇవ్వలేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. అటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఇవే విమర్శలు చేశారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. క్రిస్మస్ గిఫ్ట్‌ల పంపిణీ కార్యక్రమంలో అధికారులు ప్రోటోకాల్ విస్మరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఫొటోలు మాత్రమే పెట్టి, స్థానిక ఎమ్మెల్యే అయిన తన ఫొటోను ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. అసలు ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డిని ఎలా ఆహ్వానిస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పల్లా.
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోనూ స్థానిక ఎమ్మెల్యే విజయుడికి కూడా ప్రోటోకాల్ ఇవ్వలేదనే విమర్శలు వినిపించాయి. క్రిస్మస్ కానుకల పంపిణీ.. కాంగ్రెస్ కార్యక్రమంగా జరిగిందంటూ బీఆర్ఎస్ విమర్శించింది. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే విజయుడు ఫొటో, పేరు పెట్టకపోవడాన్ని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. పైగా మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఫొటో, పేరు ఉండడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
బీజేపీ నుంచి గెలిచిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సైతం.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రోటోకాల్‌పై హాట్ కామెంట్స్ చేశారు. కొడంగల్‌లో ప్రజలు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించినట్టే.. ఆర్మూర్ ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. ఓడిపోయిన వారు అధికారులతో రివ్యూ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఎలా చెబుతారని పైడి రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. అలా అయితే.. ఇక ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండటం దేనికని ఘాటుగానే మాట్లాడారు.
ప్రజాపాలన అమలుపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చేపట్టిన సమీక్షలో.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన అభ్యర్థులు కూడా పాల్గొన్నారు. ప్రోటోకాల్ లేని వ్యక్తులను కలెక్టరేట్ సమావేశంలో ఎలా అనుమతించారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. అదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేకపోవడంపై ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, ప్రభుత్వం మాత్రం దీన్ని లైట్ తీసుకుంటోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్లకు ప్రోటోకాల్ ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు మంత్రి కొండా సురేఖ. తాము కూడా ఈ విషయంలో బాధపడ్డామన్నారు.
గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తక్కువ మంది ఉన్నారు. సో, ప్రోటోకాల్ విషయం పెద్దగా హైలెట్ కాలేదు. రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడే తన నియోజకవర్గానికి వెళ్లనివ్వలేదు. ఏ అధికారిక కార్యక్రమానికి ఆహ్వానించలేదు. అప్పట్లో ప్రోటోకాల్‌పై రేవంత్‌రెడ్డి కూడా ప్రశ్నించారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో 39 మంది ఎమ్మెల్యేలు ఉండడం, ప్రతిపక్ష బలం ఎక్కువగా ఉండడంతో ప్రోటోకాల్ రగడ కాస్త గట్టిగానే వినిపిస్తోంది. మొత్తానికైతే.. చాలాచోట్ల బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను ఆహ్వానించకుండా, కాంగ్రెస్ నేతలతో అధికారిక కార్యక్రమాలు చేయిస్తున్నారన్నది నిజం. దీనిపై మండిపడుతున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు.. ప్రోటోకాల్ ఇవ్వని అధికారులపై అసెంబ్లీ స్పీకర్, చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం సెట్‌రైట్ చేసుకుంటుందో లేదో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…