AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Swaminathan: దేశ వ్యవసాయరంగం పెద్ద దిక్కును కోల్పోయింది.. స్వామినాథన్ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం..

MS Swaminathan: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఎం.ఎస్ స్వామినాథన్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. వారి మరణంతో దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాధారిత భారత దేశంలో..

MS Swaminathan: దేశ వ్యవసాయరంగం పెద్ద దిక్కును కోల్పోయింది.. స్వామినాథన్ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం..
KCR
Shiva Prajapati
|

Updated on: Sep 28, 2023 | 2:06 PM

Share

MS Swaminathan: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఎం.ఎస్ స్వామినాథన్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. వారి మరణంతో దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాధారిత భారత దేశంలో మెజారిటీ ప్రజల జీవనాధారం, దేశ ప్రజల సాంస్కృతిక జీవన విధానం వ్యవసాయ రంగంతో ముడివడి వున్నదనే దార్శనికతతో, సాంప్రదాయ పద్దతిలో సాగుతున్న దేశీయ వ్యవసాయాన్ని ఎం ఎస్ స్వామినాథన్ వినూత్న పద్దతుల్లో గుణాత్మక దశకు చేర్చారని సిఎం అన్నారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందంటే అది ఎం ఎస్ స్వామినాధన్ కృషితోనే సాధ్యమైందని సిఎం కేసీఆర్ అన్నారు.

దేశ ప్రజల ప్రధాన ఆహార వనరులైన వరి, గోధుమ తదితర పంటలపై ఎం.ఎస్.స్వామినాథన్ చేసిన అద్భుతమైన ప్రయోగాలతో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. వ్యవసాయ రంగంలో వారు చేసిన పరిశోధనలు సిఫారసులు దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయని సిఎం అన్నారు. దేశ జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార భధ్రత దిశగా దార్శనికతతో జీవిత కాలం కృషి చేసిన మొట్టమొదటి వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్ అని సిఎం అన్నారు. భిన్నమైన భౌగోళిక భూసార పరిస్థితులు కలిగి, దేశంలోని రాష్ట్రాల వారిగా ప్రజలు పండిస్తున్న పంటలపై వాటిని అభివృద్ధిపై విస్తృత పరిశోధనలు చేసిన ఎం ఎస్ స్వామినాథన్ ప్రతి భారత రైతు హృదయంలో స్థిరస్థాయిగా నిలిచిపోతాడని సిఎం అన్నారు.

తెలంగాణ లో వ్యవసాయ రంగాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను ఎం ఎస్ స్వామినాథన్ పలుమార్లు కొనియాడిన విషయాలను,తనతో వారికున్న అనుబంధాన్ని సిఎం గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎంఎస్ స్వామినాథన్ రాష్ట్రానికి రావడం, వారితో తాను రాష్ట్ర సచివాలయంలో సమావేశం కావడం మరిచిపోలేనని సిఎం అన్నారు. ఆ సందర్భంగా వారితో జరిగిన విస్తృత స్థాయి చర్చలో వారు చేసిన పలు సూచనలు అమూల్యమైనవని సిఎం తెలిపారు. ఉచిత విద్యుత్, ఎత్తిపోతలతో సాగునీటి రంగాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణను వారు ఎంతగానో ప్రశంసించారని సిఎం గుర్తు చేసుకున్నారు. రైతు సంక్షేమం కోసం, సమ్మిళిత వ్యవసాయ రంగ సుస్థిరాభివృద్ధికోసం ఎంఎస్ స్వామినాథన్ చేసిన సిఫారసులు వారి దార్శనికత వొక రైతు బిడ్డగా తనను ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు.

వొక నాడు ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో, కరువు తాండవమాడిన తెలంగాణ నేలన నేడే పసిడి పంటలు పండుతుండడం వెనక, వ్యవసాయ అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణలో, పంటల ఉత్పత్తిలో తెలంగాణ నేడు దేశానికి ఆదర్శంగా నిలవడం వెనక ఎంఎస్ స్పూర్తి ఇమిడి వున్నదని సిఎం తెలిపారు. తెలంగాణ నేలలు అత్యంత సారమంతవైనవని, పాలకులు సరియైన దృష్టి సారిస్తే తెలంగాణ దేశానికే విత్త భాంఢాగారంగా విలసిల్లుతుందని చెప్పిన స్వామినాథన్ ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేసి చూపించిందన్నారు.

తెలంగాణలో జరుగుతున్న రైతు సంక్షేమాన్ని వ్యవసయరంగాభివృద్ధిని గురించి తెలుసుకున్న ఎంఎస్ విశ్వనాథన్ తెలంగాణ ను సందర్శించడానికి ఆసక్తి కనబరిచేవారని సిఎం అన్నారు. ఇదే విషయాన్ని తెలుపుతూ ఇటీవలే వారితో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల సమావేశంలో తెలంగాణ వ్యవసాయాభివృద్ధి ని తెలుసుకుని ఎంతో ఆనందం వ్యక్తం చేశారని, తాను వీలుచూసుకుని తెలంగాణ పర్యటనకు వస్తానని మాట ఇచ్చిన స్వామినాథన్ వారి ఆకాంక్ష తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెల్లిపోవడం బాధను కలిగిస్తున్నదని సిఎం విచారం వ్యక్తం చేశారు. వారి మన్ననలు పొందడం రైతుబిడ్డగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనకెంతో గర్వకారణమని సీఎం అన్నారు. వారి మరణం దేశ వ్యవసాయ రంగానికి తీరని లోటని, దేశ రైతు పెద్ద దిక్కును కోల్పోయిందని సిఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..