AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామం.. సీఎం నివాసంలో మంత్రులకు ప్రైవేట్ డిన్నర్ పార్టీ

మా ఇంటికి రండి...! మా అథిత్యాన్ని స్వీకరించండి...! పసందైన విందుకు హాజరై మమ్మల్ని సంతోషపరచండి...! మీ రాకకోసం ఎదురుచూస్తూ... ఇట్లు మీ సీఎం రేవంత్‌రెడ్డి. యస్‌... ఈ విందు ఆహ్వానంతో సీఎం ఇంటి దగ్గర మంత్రివర్గం కనివిందు చేసింది. దాదాపుగా మంత్రులంతా సీఎం ఇచ్చిన డిన్నర్‌కి హాజరయ్యారు. ఇప్పుడీ విందే ఆసక్తికరంగా మారింది. ఆలాఫ్‌ సడెన్‌గా ఎందుకీ డిన్నర్‌ పార్టీ...? మంత్రివర్గ విస్తరణకు ముందు ఆనవాయితీగా ఇచ్చిందా...? లేక సీఎం క్యాజువల్‌ డిన్నరా...? ఈ డిన్నర్‌ని టీ-కాంగ్రెస్‌ ఎలా చూస్తోంది...?

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామం.. సీఎం నివాసంలో మంత్రులకు ప్రైవేట్ డిన్నర్ పార్టీ
Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: May 29, 2025 | 7:21 AM

Share

ఇదిగో మంత్రివర్గ విస్తరణ.. అదిగో ఫైనల్‌ ప్రకటన.. అంటూ గతకొన్నాళ్లుగా తెలంగాణ కేబినెట్‌ విస్తరణపై ప్రచారం జరుగుతూనే ఉంది..! సీఎం రేవంత్‌ హస్తినబాట పట్టిన ప్రతీసారి కేబినెట్‌ విస్తరణపై చర్చ జరిగితీరాల్సిందే..! మొన్నటికి మొన్న దాదాపుగా అయిపోయినట్లే.. మంత్రులెవరో ఫిక్స్‌ అయ్యారు.. ఇవాళో రేపో ప్రకటించడమే తరువాత అన్న సంకేతాలందాయి..! ఆ మర్నాడే మళ్లీ పాత కథే అయ్యింది. తెలంగాణ కేబినెట్ విస్తరణ మళ్లీ ముహూర్తం వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో ఆసక్తికర పరిణామం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులందరికి తన ఇంట్లో డిన్నర్ పార్టీ ఇవ్వడంతో మళ్లీ కేబినెట్‌ అంశం తెరపైకొచ్చింది.

సీఎం పిలుపుతో మంత్రివర్గం కదిలింది..! మా ఇంటికొచ్చి విందు ఆరగించి పోండి అన్న ఆహ్వానంతో దాదాపుగా మంత్రివర్గం మొత్తం సీఎం ఇంట్లో వాలిపోయింది. ముఖ్యమంత్రి ఇచ్చిన విందును ఆరగించింది..! అంతా ఓకే కానీ.. ఇప్పుడే ఈ డిన్నర్‌ ఎందుకు..? రేపు సీఎం ఢిల్లీ వెళ్లనుండటంతో సడెన్‌గా ఈ విందు ఏర్పాటేంటి..? విందు పేరుతో మంత్రులంతా ఏం చర్చించారు..? సీఎం వాళ్లకు ఏం చెప్పారు..? ఇప్పుడీ అంశాలే ఆసక్తిని పెంచుతున్నాయి. కేబినెట్‌ బెర్త్‌ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న నేతల్లో మరింత ఉత్కంఠ రేపుతున్నాయి.

మొన్ననే మంత్రివర్గ విస్తరణ దాదాపుగా పూర్తైందని.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ప్రకటన వాయిదా పడిందని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఖర్గే ఈనెల 30న అంటే రేపు ఢిల్లీలో ల్యాండ్‌ అవుతారు. అలాగే ఇట్నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి కూడా రేపే హస్తినకు వెళ్తారు. దీంతో ఇన్నాళ్ల నిరీక్షణకు రేపు ఎండ్‌ కార్డ్‌ పడబోతోందన్న ప్రచారం గట్టిగా నడుస్తోంది. ఆ కేబినెట్‌ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలోనే ఈ ప్రైవేట్ డిన్నర్‌పై తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. విస్తరణకు ముందు సీఎం ఆనవాయితీగా ఇస్తున్న డిన్నర్‌ అంటూ కూడా బయట టాక్‌ వినిపిస్తోంది.

నేను మంత్రినవుతా.. నేను మంత్రినవుతా ఇప్పటికే ఎంతోమంది బడా నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో ప్రయత్నాలు చేశారు. మంత్రిపదవి కోసం పార్టీకే అల్టిమేటం జారీ చేసిన నేతలూ ఉన్నారు. వాళ్లంతా ఈ డిన్నర్‌ మీటింగ్‌ని ఆసక్తిగా తిలకించారు. మంత్రివర్గ విస్తరణపైనే మాట్లాడారంటూ చర్చించుకుంటున్నారు. ఆ లిస్ట్‌లో తమ పేరు ఉందో లేదోనన్న టెన్షన్‌లో పడ్డారు నేతలు. మొత్తంగా.. సీఎం డిన్నర్ పార్టీపై ఓవైపు ఆసక్తి.. మరోవైపు నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..