Telangana: గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ..
తెలంగాణ ప్రభుత్వం గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల రక్షణకు 2025 చట్టాన్ని ఆమోదించింది. ఇది మూడు లక్షల మంది కార్మికులకు ఉద్యోగ భద్రత, పారదర్శక వేతనాలు, బీమా కల్పిస్తుంది. ప్లాట్‌ఫామ్ అల్గోరిథమ్‌లలో పారదర్శకతను చట్టబద్ధం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రత్యేక బోర్డు, సంక్షేమ నిధి ఏర్పాటు కానున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం గిగ్, ప్లాట్‌ఫామ్ ఆధారిత కార్మికుల కోసం ప్రత్యేక చట్టాన్ని ఆమోదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ చట్టం – 2025 ముసాయిదా బిల్లుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రవాణా, డెలివరీ, హోం సర్వీసులు, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో పనిచేస్తున్న సుమారు మూడు లక్షల మంది గిగ్ వర్కర్లకు చట్టబద్ధ రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. నీతి ఆయోగ్ అంచనా ప్రకారం.. రాష్ట్రంలో లక్షలాది గిగ్ వర్కర్లు రోజుకు 10-12 గంటలు, వారానికి ఏడు రోజులు పని చేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత, బీమా, పారదర్శక వేతన వ్యవస్థ, బేరసారాల హక్కులు వంటి వాటి నుంచి దూరంగా ఉన్నారు. ప్లాట్‌ఫామ్‌ల అల్గోరిథమ్‌లలో పారదర్శకత లేకపోవడం వలన చెల్లింపులు, రేటింగ్‌లు ప్రభావితమవుతున్నాయి. ఈ సమస్యలకు చట్టపరమైన పరిష్కారం కోసం ఈ బిల్లు రూపుదిద్దుకుంది.
20మంది సభ్యులతో బోర్డు
డిసెంబర్ 2024లో జరిగిన గిగ్ వర్కర్ల సమాలోచన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ విభాగం న్యాయ శాఖతో కలిసి ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. అన్ని వాటాదారుల అభిప్రాయాలు సేకరించిన తర్వాత కేబినెట్ చివరి ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో గిగ్ కార్మికులకు మొదటిసారిగా చట్టపరమైన గుర్తింపు లభిస్తుంది. ప్రత్యేక ఐడీతో రాష్ట్ర పథకాలు, సంక్షేమ రక్షణకు అర్హత కలుగుతుంది. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం 20 మంది సభ్యుల బోర్డును ఏర్పాటు చేస్తారు. ఇందులో ప్రభుత్వం, ప్లాట్‌ఫామ్ కంపెనీలు, కార్మిక సంఘాలు, పౌర సమాజం, టెక్నికల్ నిపుణులు ఉంటారు. బోర్డుకు కార్మిక శాఖ మంత్రి అధ్యక్షత వహిస్తారు.
కార్మికుల హక్కులను స్పష్టంగా నిర్వచించిన ఈ బిల్లులో రిజిస్ట్రేషన్ హక్కు, భద్రమైన పని వాతావరణం, వేతనాల్లో పారదర్శకత, అల్గోరిథమిక్ నిర్ణయాల వివరాలు తెలిసే హక్కు వంటి అంశాలు ఉన్నాయి. ప్లాట్‌ఫామ్ కంపెనీలు 60 రోజుల్లోపు కార్మికుల డేటాను ప్రభుత్వానికి అందించాలి. అగ్రిగేటర్లు 45 రోజుల్లోపు తప్పనిసరిగా నమోదు కావాలి. సంక్షేమ నిధి ఏర్పాటు ఈ బిల్లో కీలక అంశం. అగ్రిగేటర్ చెల్లింపులపై ప్రభుత్వం నిర్ణయించే శాతంలో సంక్షేమ రుసుము, ప్రభుత్వ గ్రాంట్లు, CSR విరాళాలు, వ్యక్తిగత సహకారం వంటి వాటితో నిధి సమీకరిస్తారు. ప్రమాద మరణ పరిహారం, ఆరోగ్య సహాయం, వివాహ సహాయం వంటి పథకాలకు ఈ నిధిని వినియోగిస్తారు.
తొలిరాష్ట్రంగా తెలంగాణ
అల్గోరిథమిక్ పారదర్శకతను చట్టబద్ధం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. అసైన్మెంట్‌లు, ప్రోత్సాహకాలు, రేటింగ్‌లను అల్గోరిథంలు ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనేదాన్ని ప్లాట్‌ఫామ్‌లు బహిర్గతం చేయాలి. వేతనాలను ప్రభావితం చేసే ఆటోమేటెడ్ నిర్ణయాలు కూడా కార్మికులకు తెలియజేయాలి. ఫిర్యాదుల పరిష్కారం కోసం త్రిస్థాయి వ్యవస్థను ప్రతిపాదించారు. ప్లాట్‌ఫారం స్థాయి వివాద పరిష్కార కమిటీ, ప్రభుత్వం నియమించే ఫిర్యాదు అధికారి, డిప్యూటీ కమిషనర్ స్థాయి అప్పీలేట్ అథారిటీ ఉండనున్నాయి. ఒప్పంద మార్పులకు 14 రోజుల నోటీసు, తప్పనిసరి కారణాలు మినహా తొలగింపుకు 7 రోజుల నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.
కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, జార్ఖండ్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ బిల్లు అత్యంత సమగ్రంగా ఉండడం విశేషం. CSR నిధులను కూడా స్పష్టంగా చేర్చడం తెలంగాణ చట్టానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాష్ట్ర శ్రామిక రంగాన్ని ఫార్మలైజేషన్ దిశగా తీసుకెళ్లడమే కాకుండా గిగ్ వర్కర్ పాలనలో తెలంగాణను జాతీయ స్థాయిలో ముందుండేలా చేయడమే ఈ చట్టం లక్ష్యం. గిగ్ వర్కర్ల సంక్షేమం, కార్మిక-ప్లాట్‌ఫారం సంబంధాల మెరుగుదల, డేటా ఆధారిత పాలనకు ఇది మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
