Kishan Reddy: సౌదీ ప్రమాదం.. విదేశాంగ మంత్రితో మాట్లాడిన కిషన్ రెడ్డి.. ప్రత్యేక టీమ్ ఏర్పాటు..
సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రికుల ఘోర రోడ్డు ప్రమాదం 46 మంది భారతీయ యాత్రికుల ప్రాణాలను బలిగొంది. వీరిలో ఎక్కువ మంది తెలంగాణకు చెందినవారే ఉన్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడారు. సౌదీలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

మక్కాకు వెళ్లిన 46 మంది భారతీయ యాత్రికులు సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందినవారు కావడం మరింత విచారకరం. ఈ ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.
సమన్వయానికి ప్రత్యేక బృందం
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. ప్రధాని మోదీ సూచన మేరకు సౌదీ అరేబియాలో సహాయక, సమన్వయ ప్రయత్నాలను వేగవంతం చేయడానికి భారత్ నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సౌదీ అరేబియాలోని భారత రాయబారి డాక్టర్ సుహెల్ అజాజ్ ఖాన్‌తోనూ కిషన్ రెడ్డి మాట్లాడి.. అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు. మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తున్న యాత్రికుల బస్సు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఈ పెను ప్రమాదం జరిగినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. 46 మంది యాత్రికులలో 45 మంది సంఘటనా స్థలంలోనే మరణించారన్న ఆయన.. ఈ ఘోర ప్రమాదం నుండి ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడగా ప్రస్తుతం అతనికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాణాలతో బయటపడిన వ్యక్తికి అత్యుత్తమ వైద్య సహాయం అందించడానికి సౌదీ ప్రభుత్వం వైద్య నిపుణుల బృందాన్ని నియమించిందని చెప్పారు.
మృతదేహాల గుర్తింపు – అప్పగింత
ప్రస్తుతం సౌదీ ప్రభుత్వం మృతదేహాలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ కూడా ప్రారంభించింది.భారత రాయబార కార్యాలయం తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. కుటుంబ సభ్యుల నుండి వివరాలు తీసుకున్న తర్వాత మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడం లేదా అక్కడే అంత్యక్రియలు నిర్వహించడంపై నిర్ణయం తీసుకోనుంది. కుటుంబ సభ్యులు తీసుకునే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది’’ అని కేంద్రమంత్రి వివరించారు. విదేశాంగ శాఖ బాధిత కుటుంబాలతో నిరంతరం మాట్లాడుతుందని.. వారికి అన్ని విధాల అండగా ఉంటామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
