రియల్టర్, బిల్డర్లకు గుడ్‌న్యూస్.. ప్రతిసారీ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేదు.. రిజిస్ట్రేషన్ శాఖ కొత్త రూల్..!
రియల్టర్, బిల్డర్లకు శుభవార్త తీసుకువచ్చింది తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆన్‌లైన్ సేవలను మరింత సరళతరం చేసింది. కొత్తగా ‘బిల్డర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్’ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Builder Registration Module: రియల్టర్, బిల్డర్లకు శుభవార్త తీసుకువచ్చింది తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆన్‌లైన్ సేవలను మరింత సరళతరం చేసింది. కొత్తగా ‘బిల్డర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్’ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక, ఎవరైనా రియల్టర్, బిల్డర్.. ప్లాట్లను విక్రయించిన ప్రతిసారీ వారి వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇందుకోసం ‘బిల్డర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్’ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ తెలిపింది.
ప్రస్తుతం ఒక రియల్టర్ వంద ప్లాట్లను విక్రయిస్తే ప్రతిసారి అతని వివరాలను నమోదు చేయాల్సి వస్తోంది. ఒక్కోరోజు ఎక్కువ సంఖ్యలో ప్లాట్లను విక్రయించినప్పుడు వివరాల నమోదుకు అధిక సమయం తీసుకుంటూ రిజిస్ట్రేషన్లు వాయిదా కూడా పడుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త మాడ్యూల్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లోనే రియల్టర్ల కోసం ప్రత్యేకంగా డాష్‌బోర్డు ఏర్పాటు చేసింది. ఇందులో ఒక రియల్టర్, బిల్డర్ రాష్ట్రంలో ఎన్ని వెంచర్లు చేశాడు.. ఎన్ని ప్లాట్లను విక్రయించాడు, ఇంకా విక్రయించాల్సిన ప్లాట్లు ఎన్ని.. అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా క్రయ విక్రయాలు చేసే రియల్టర్లకు, బిల్డర్లకు డాక్యుమెంటేషన్ సమయంలో సమయం వృధా కాకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రియల్టర్లకు, బిల్డర్లు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు సమయం కూడా కలిసి వస్తుందంటున్నారు.