తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 3వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వానికి చివరి బడ్జెట్ కానుంది. పైగా ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో ఆచీతూచీ బడ్జెట్ రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాక ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన పిదప రాష్ట్ర బడ్జెట్‌పై ప్రణాళికలు చేయాలనే ఆలోచనతో ఉంది ఆధికార బీఆర్ఎస్ పార్టీ. ఇక మార్చి 7న జరిగిన గతేడాది(2022-23) బడ్జెట్ సమావేశాలతో పోలిస్తే ఈ సంవత్సరం(2023-24) నెల ముందే జరపాలనే యోచనలో రాష్ట్రం ఉంది.
అయితే ఈ బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం కూడా 2023-24 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,56,958 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. 2023-24 బడ్జెట్ ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్టు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని శాఖలు ఈ నెల 13వ తేదీలోపు తమకు ప్రతిపాదనలు పంపాలని, అలాగే 12వ తేదీలోపే అవి ముఖ్య కార్యదర్శులకు చేరాలని ఆదేశించారు.
కాగా, ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలతో పాటు 2022-23 బడ్జెట్‌లో దళితబంధు కోసం కేటాయించిన నిధులను వినియోగించకపోవడం, ఆ పథకం రెండో విడత ప్రారంభం కాకపోవడం, గిరిజన బంధు కూడా ఇస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించడంతో వీటిపై అసెంబ్లీలో ఆయన ఏం చెబుతారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రస్తుత ఏడాదిలో అంచనా వేసిన మేరకు కేంద్ర గ్రాంట్లు, అప్పులు అందడంలేదు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే బడ్జెట్ రూపకల్పన ఉంటుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..