AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: హత్యాయత్నం కేసులో ఏ1‌గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన కొడుకుపై కేసు

కొమురంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం లో పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. బరిలో నిలిచిన‌ నేతల మధ్య మాటల తూటాలే కాదు, అక్కడి కార్యకర్తలు చేతులకు కూడా పని చెప్తున్నారు. పరస్పరం దాడులకు‌‌ దిగుతుండటంతో ఇరు వర్గాల మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఏకంగా సిర్పూర్ బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై హత్యాయత్నం, దొంగతనం కేసు ‌నమోదవగా.. ఆయన తనయుడు పునీత్‌పై సైతం హత్యాయత్నం కేసు‌ నమోదైంది.

Telangana Election: హత్యాయత్నం కేసులో ఏ1‌గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన కొడుకుపై కేసు
Konappa, Rs Praveen
Follow us
Naresh Gollana

| Edited By: Balaraju Goud

Updated on: Nov 14, 2023 | 11:11 AM

కొమురంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం లో పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. బరిలో నిలిచిన‌ నేతల మధ్య మాటల తూటాలే కాదు, అక్కడి కార్యకర్తలు చేతులకు కూడా పని చెప్తున్నారు. పరస్పరం దాడులకు‌‌ దిగుతుండటంతో ఇరు వర్గాల మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఏకంగా సిర్పూర్ బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై హత్యాయత్నం, దొంగతనం కేసు ‌నమోదవగా.. ఆయన తనయుడు పునీత్‌పై సైతం హత్యాయత్నం కేసు‌ నమోదైంది. సిర్పూర్ లో దాడులు జరగొచ్చని బీఎస్పి అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ అక్కడి ప్రజల్లో కనిపిస్తుంది.

నిన్న మొన్నటి వరకు ప్రశాంత వాతావరణంలో కొనసాగిన సిర్పూర్ రాజకీయాలు.. బీఎస్పీ ఎంట్రీ తోనే దాడులకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందంటూ ఆరోపిస్తోంది బీఆర్ఎస్. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ హత్యా రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమంటూ బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తోంది. మరోవైపు దాడులు ప్రతిదాడులతో ఇరువర్గాల మీద కేసులు నమోదవుతున్నాయి. పోలీస్ మార్కు రాజకీయం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే, పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని అడ్డదారిలో గెలిచేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందంటూ బీఎస్పి ఆరోపిస్తోంది.

దాడులు‌ జరగొచ్చు, అదనపు‌ బలగాలను‌ పంపండి ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజక వర్గంలో ఎన్నికల వేళ చేసిన హాట్ కామెంట్స్. సిర్పూర్ లో రాజకీయాలు పోలీసుల కనుసన్నల్లో నడుస్తున్నాయి, ఎప్పుడు ఏదైనా జరగొచ్చు, మాకు ఈ ఆసిఫాబాద్ ఎస్పీ సురేష్ కుమార్ పై‌ నమ్మకం లేదు. వెంటనే ఈ ఎస్పీని మార్చాలంటూ డిమాండ్ చేశారు సిర్పూర్ బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

సిర్పూర్ నియోజకవర్గంలో దాడుల రాజకీయం సాగనుందని నీలి కండువా కప్పుకున్న కార్యకర్తలపై బీఆర్ఎస్ గుండాలు రెచ్చిపోతున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 35 ఏళ్ల పాటు పోలీస్ సర్వీస్ చేసిన తనకు అడిషనల్ డీజీగా రిటైర్డ్ అయినందుకు పోలీసులు గొప్ప బహుమతి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్. న్యాయం కోసం ఒక‌ ఎప్ఐఆర్ కోసం మూడు గంటలు పోలీస్ స్టేషన్ ఎదుట కూర్చోబెట్టి మరీ పోలీసు వ్యవస్థ మీద నమ్మకాన్ని కోల్పోయేలా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ మెడల్ సంపాదించిన తనపైనే దొంగతనం హత్యాయత్నం కేసులు పెట్టారని ఫైరయ్యారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆర్ఎస్పీ.

అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీఆర్ఎస్ అభ్యర్థి‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ మార్క్ రాజకీయం చేయాలని చూస్తున్నారని.. సిర్పూర్ నియోజకవర్గంలో ప్రశాంతతను చెడగొడుతున్నారంటూ ఆరోపించారు. తమ కార్యకర్తలపైనే దాడి చేసి, ఉల్టా చోర్ కొత్వాల్‌ కు‌ మారా అన్నట్టుగా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారని‌ విరుచుకుపడ్డారు. అడిషనల్ డిజీగా రిటైర్డ్ అయిన వ్యక్తికి ఎన్నికల కోడ్ తెలియదా.. అని ప్రశ్నించారు. కోడ్ ఉండగా రాత్రి పోలీస్ స్టేషను ఎదుట హంగామా ఎందుకు చేశారో చెప్పాలన్నారు. పరస్పర ఫిర్యాదుల మేరకు ఇరు పార్టీల నేతల మీద కేసులు నమోదు చేశారు కాగజ్‌నగర్ పోలీసులు.

బీఎస్పీ, బీఆర్ఎస్ లీడర్ల మధ్య జరిగిన గొడవకు సంబంధించి పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. బీఎస్పీ లీడర్ల మీద బెదిరింపులకు సంబంధించి ఆ పార్టీ నేత సయ్యద్ ఫహీమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కోనప్పతో పాటు బీఆర్ఎస్ లీడర్లు అలీం, కోనేరు ఫణి, లలిత్ బల్హోత్రా, అన్షుమన్, కోనేరు వాసుతో పాటు మరో 15 మందిపై కేసులు నమోదు చేశారు.

బీఆర్ఎస్ ప్రచార రథం డ్రైవర్ అలీం ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎస్పీ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన కొడుకు పునీత్, నాయకులు ఆర్షద్ హుస్సేన్ సహా 16 మంది మీద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాగజ్ నగర్ ఎస్ హెచ్ బుద్దే స్వామి తెలిపారు. బీఆర్ఎస్ ప్రచార రథం డ్రైవర్ పై దాడి కేసులో A1గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను చేర్చారు. 395, 307, 427, 171 F r/w 34 IPC సెక్షన్ల కింద బీఎస్పీ నేతలపై కేసు నమోదు చేశారు కాగజ్ నగర్ పోలీసులు.

ఈ ఘటనపై స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. డీఎస్పీ, సీఐలు బీఎస్పీదే తప్పన్నట్టు మాట్లాడారని, తాము కంప్లయింట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి మూడున్నర గంటలు తీసుకున్నారన్నారు. అడిషనల్ డీజీగా పనిచేసిన తన పరిస్థితే ఇలా ఉంటే నియోజక వర్గంలో పేదల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. సర్వీస్ లో నిజాయితీగా పని చేసి పోలీస్ మెడల్‌ సంపాదించిన తనపై‌ ఈ కుట్రల రాజకీయాలతో 25 వేలు దొంగతనం చేసినట్లుగా కాగజ్ నగర్ పోలీసులు కేసు పెట్టారని.. ఓ డ్రైవర్ వద్ద దొంగతనం చేస్తానా అని ప్రశ్నించారు. ఎస్పీ సురేశ్ కుమార్ బాధ్యతల్లో ఉంటే సిర్పూర్ లో ఎన్నికలు సజావుగా సాగవని.. వెంటనే అతన్ని బదిలి చేయాలని ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఎస్పీతో పాటు కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్, కాగజ్ నగర్ టౌన్ సీఐ స్వామిలను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

అయితే ప్రవీణ్ చేసి వ్యాఖ్యలను ఖండిస్తూనే సంచలన‌ ఆరోపణలు చేశారు కోనేరు కోనప్ప. ప్రవీణ్ కుమార్ హత్యా రాజకీయాలకు తెర లేపబోతున్నారని.. దాడులతో సిర్పూర్ లో ప్రశాంతతను కొల్లగొట్టబోతున్నాడని.. సిర్పూర్ కు‌ అదనపు బలగాలను‌ పంపించి సిర్పూర్ నియోజక వర్గంలో సజావుగా ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో చూడాలని కోరారు బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…