Telangana Assembly: హైకోర్టు జోక్యంతో తప్పిన రాజ్యాంగ సంక్షోభం.. చెరో మెట్టుదిగిన గవర్నర్, సీఎం.. ఇంతకీ సెషన్ ప్రారంభం ఎప్పుడో?

రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవుల్లో ఉన్న యంత్రాంగాలు న్యాయస్థానాల్లో తలపడటం సరికాదంటూ తెలంగాణ ఉన్నత న్యాయస్థానం చేసిన సూచన మేరకు అటు రాజ్ భవన్, ఇటు ప్రగతి భవన్ చెరో మెట్టు దిగాయి.

Telangana Assembly: హైకోర్టు జోక్యంతో తప్పిన రాజ్యాంగ సంక్షోభం.. చెరో మెట్టుదిగిన గవర్నర్, సీఎం.. ఇంతకీ సెషన్ ప్రారంభం ఎప్పుడో?
CM KCR- Governor Tamilisai Soundararajan
Follow us

|

Updated on: Jan 30, 2023 | 8:32 PM

ప్రతిష్ఠంభన తొలగినప్పటికీ సందిగ్ధత మాత్రం ఇంకా వీడలేదు. రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవుల్లో ఉన్న యంత్రాంగాలు న్యాయస్థానాల్లో తలపడటం సరికాదంటూ తెలంగాణ ఉన్నత న్యాయస్థానం చేసిన సూచన మేరకు అటు రాజ్ భవన్, ఇటు ప్రగతి భవన్ చెరో మెట్టు దిగాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం ఓకే చెప్పడంతో.. బడ్జెట్ ఆమోదానికి రాజ్ భవన్ సుముఖత వ్యక్తం చేసినట్లు తాజాగా సమాచారం అందుతుంది అయితే శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ఇంకా మూడు రోజుల వ్యవధి మాత్రమే మిగిలింది. కానీ జరగాల్సిన తంతు చాలానే ఉంది. దాంతో తప్పనిసరి పరిస్థితిలో బడ్జెట్ సమావేశాల ప్రారంభ తేదీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత రెండేళ్ల కాలంలో గవర్నర్ తమిళసై, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య అగాధం పెరిగిన నేపథ్యంలో శాసనసభ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభిస్తూ వస్తోంది. గత సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రభుత్వం ముందుకెళ్ళింది. అయితే ఆనాడు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అనుమతించే ముందు గవర్నర్ తన ప్రసంగం ఉందా లేదా అన్న అంశాన్ని వాకబు చేయలేదు. కానీ గత ఏడాదికాలంగా ప్రభుత్వానికి, గవర్నర్ కార్యాలయానికి మధ్య గ్యాప్ మరింత పెరిగిపోవడంతో ఈసారి తమిళసై సౌందర్ రాజన్ కాస్త వ్యూహాత్మకంగానే పావులు కదపడం విశేషం. తద్వారా తన ఆధిపత్యాన్ని కొంత మేరకు ఆమె చాటుకున్నారు కూడా. ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదించిన దుష్యంత్ దవే సరైన సమయంలో సరిగ్గా స్పందించడం ద్వారా రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించారు అనే చెప్పాలి.

రిటర్న్ కమ్యూనికేషన్‌తో షాక్

తెలంగాణ శాసనసభ నిర్దిష్ట గడువుకు లోబడి సమావేశం అవుతూ వస్తున్నప్పటికీ.. ఒక విధానాన్ని మాత్రం పక్కన పెట్టారు. ఏ సీజన్లో అయినా సభ సమావేశాలు ముగిసిన తర్వాత సెషన్ ముగిసిన సమాచారాన్ని గవర్నర్‌కు నివేదించడం ద్వారా సెషన్‌ను ప్రోరోగ్ చేయించడం పరిపాటి. ఒకసారి ప్రోరోగ్ అయిన తర్వాత తిరిగి సభ సమావేశం కావాలంటే మళ్లీ గవర్నర్ ద్వారా నోటిఫై చేయించడం అవసరం. అయితే తమిళ సై గవర్నర్‌లా కాకుండా బిజెపి నేతగా వ్యవహరిస్తున్నారని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్‌తో ప్రమేయం లేకుండానే శాసనసభ సమావేశాలను గత రెండేళ్లుగా నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా గత ఏడాది బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే సెషన్ ప్రారంభమైంది. సభ ముందుకు బడ్జెట్ వచ్చేసింది. 2021వ సంవత్సరంలో గవర్నర్ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత ప్రోరోగ్ ప్రక్రియను పక్కనపెట్టి అవే సమావేశాలను కొనసాగిస్తూ వస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. ఈసారి అదే రకంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సెషన్ ప్రారంభించాలని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇందులో భాగంగా జనవరి 21వ తేదీన బడ్జెట్ ముసాయిదా ప్రతులకు ఆమోదం తెలుపవలసిందిగా రాజ్‌భవన్‌కు లేఖ వెళ్లింది. కానీ ఈసారి గవర్నర్ తమిళసై వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బడ్జెట్‌కు ఆమోదం తెలపకుండా అసలు గవర్నర్ ప్రసంగం ఉందా లేదా అంటూ నోట్ పైల్ మీద రాసి తిరిగి పంపించారు. దాంతో కేసీఆర్ ప్రభుత్వం ఒకింత షాక్ అయిందని చెప్పాలి. ప్రభుత్వానికి గవర్నర్ పంపిన రిటర్న్ కమ్యూనికేషన్ ప్రభుత్వాన్ని ఎరకాటంలోకి నెట్టింది. అయితే మెట్టు దిగని కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ వ్యవహార శైలిపైన హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం తరఫున వాదించేందుకు సీనియర్ అండ్ కాస్ట్లీ అడ్వకేట్ దుష్యంత్ దవేని నియమించుకుంది. ఇంకోవైపు ఫిబ్రవరి మూడవ తేదీ శాసనసభ సమావేశాలకు సమయం సమీపిస్తుండడంతో సర్కారు ఉక్కిరిబిక్కిరి అయింది. ఆగమేఘాల మీద అడ్వకేట్‌ని నియమించుకొని హైకోర్టులో జనవరి 30వ తేదీన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సారధ్యంలోని ద్విసభ్య ధర్మసనంపైకి వచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 202 ప్రకారం బడ్జెట్‌ని శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుందని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా గవర్నర్ ఆమోదం తెలపడం లేదని ప్రభుత్వం తరఫున న్యాయవాది దుష్యంత్ దవే న్యాయస్థానంలో చెప్పేందుకు సిద్ధమయ్యారు. అయితే పిటిషన్‌ని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తులు గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య కొనసాగుతున్న ఈ అగాధం రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో ఇరుపక్షాలు మెట్టు దిగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వ, రాజభవన్ తరపు న్యాయవాదులు ఓ పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగబద్ధ నిర్వహణకు ఇరుపక్షాలు కలిసి పని చేయాలన్నది వీరి మధ్య కుదిరిన ఒప్పందం. ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం అంగీకరించినట్లు కోర్టుకు నివేదించారు. అదే సమయంలో బడ్జెట్‌ని ఆమోదించేందుకు గవర్నర్ సిద్ధమని రాజభవన్ తరపు న్యాయవాది అశోక్ ఆనంద్ హైకోర్టుకు తెలిపారు. దీంతో రాజ్యంగ సంక్షోభం దిశగా పడిన అడుగులు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. ఓ పరిష్కార మార్గం లభించడంతో బంతి తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ కోర్టులోకి చేరింది.

కేసీఆర్ ఉన్నతస్థాయి సమాలోచనలు

హైకోర్టులో ఈ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి ప్రశాంత్ రెడ్డిలతో పాటు ఉన్నతాధికారులతో కేసీఆర్ ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని రూపొందించడం.. దాన్ని రాజ్‌భవన్‌కు పంపించడం.. అదే సమయంలో శాసనసభలో గవర్నర్ ప్రసంగం ఉండాలంటే గత సమావేశాలను ప్రోరోగ్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించడం వంటి పరిణామాలు ప్రగతి భవన్ సమీక్షలో చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే శాసనసభ గత సమావేశాలను ప్రోరోగ్ చేయించడం.. తిరిగి బడ్జెట్ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయించడం వంటి అంశాలు ముఖ్యమంత్రి సమీక్షలో చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ తంతు జరగడానికి కనీసం వారం లేదా పది రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో బడ్జెట్ సమావేశాలను వాయిదా వేసే అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే దీని ప్రభావం ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన పలు ఇతర కార్యక్రమాల పైన పడే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీలోగా బడ్జెట్ సమావేశాలను పూర్తి చేసి ఆ తర్వాత నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని, అమరవీరుల స్థూపాన్ని ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభించడం ద్వారా పొలిటికల్ యాక్టివిటీని ముమ్మరం చేయాలని కెసిఆర్ భావించారు. కానీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కనీసం వారం రోజులపాటు వాయిదా పడే అవకాశం ఉండడంతో ఫిబ్రవరిలో జరపతలపెట్టిని పెట్టిన మిగిలిన కార్యక్రమాల వాయిదా కూడా అనివార్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. అదేసమయంలో ఫిబ్రవరి 5న భారత రాష్ట్ర సమితి మహారాష్ట్ర బహిరంగ సభను నాందేడ్ పట్టణంలో నిర్వహించేందుకు కేసీఆర్ సిద్దమవుతున్నారు. ఈ సభకు జాతీయ స్థాయిలో దిగ్గజ నేతలను ఆహ్వానిస్తున్నారు. దీని తర్వాత ఏపీలో వైజాగ్ నగరంలో మరో సభకు బీఆర్ఎస్ నేతలు రెడీ అవుతున్నారు. వైజాగ్, నాందేడ్ సభలకు పలువురు ముఖ్యమంత్రులను, జాతీయ స్థాయి నేతలను ఇప్పటికే కేసీఆర్ ఆహ్వానించారు. ఇటు బడ్జెట్ సమావేశాలు, అటు సచివాలయ ప్రారంభోత్సం.. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ విస్తరణ.. ఇలా బహుముఖ కోణాల్లో కార్యకలాపాలు నెరపుతూ కేసీఆర్ బిజీబిజీగా మారిపోయినట్లు కనిపిస్తోంది.