22ఏపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
గత కొంతకాలంగా తెలంగాణలో 22ఏపై వివాదం నడుస్తోంది. రాజకీయ పార్టీల మధ్య పరస్పర వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులు ఉంటే.. 22ఏ పరిధిలో ఉన్నా రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

22ఏపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులు ఉంటే 22ఏ పరిధిలో ఉన్నా రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వనుంది. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేయగా.. ఇవి తక్షణమే అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. దీంతో 22ఏపై గత కొంతకాలంగా జరుగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. తెలంగాణ ప్రభుత్వం 22ఏ భూములకు సంబంధించి తాజాగా కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ఈ కొత్త కమిటీకి ఛైర్‌పర్సన్‌గా ఉండనుండగా.. రాజీవ్‌గాంధీ హనుమంతు, సందీప్‌కుమార్ ఝా, ఆయా జిల్లాల కలెక్టర్లను సభ్యులుగా నియమించింది. ఇటీవల 22ఏకు సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో సుదీర్థంగా చర్చించింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య దీనిపై వాదోపవాదనలు జరిగాయి. ప్రతిపక్షాలు 22ఏపై అనేక ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై విచారణ చేసేందుకే కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.
అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో 22ఏ భూముల నిషేధిత జాబితాకు సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) కీలక ఆదేశాలను జారీ చేసింది. ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములను 22ఏ జాబితాలో చేర్చడంపై స్వతంత్ర విచారణ జరపాలని ఎన్‌హెచ్‌ఆర్సీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. 22ఏ జాబితా కారణంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అందిన ఫిర్యాదుల మేరకు జాతీయ మానవ హక్కుల సంఘం ఈ విచారణ చేపట్టింది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త కారుపోతుల రేవంత.., భూములు నిషేధిత జాబితాలో చేరడం వల్ల ప్రజలు మానసిక, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఈ నెల 14న ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన అనంతరం.. ఎన్‌హెచ్‌ఆర్సీ 22ఏ జాబితా కారణంగా ప్రజల ఆస్తి హక్కులకు భంగం కలుగుతోందని వ్యాఖ్యానించింది. ఈ సమస్యపై సమగ్ర నివేదికను నాలుగు వారాల్లోగా సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని స్పష్టంగా ఆదేశించింది. పారదర్శకమైన, నిష్పాక్షికమైన విచారణ ద్వారా వాస్తవాలను వెలికితీయాలని ఎన్‌హెచ్‌ఆర్సీ సూచించింది.
కాగా తెలంగాణలో 22A భూముల వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారాన్ని సృష్టిస్తోంది. ఈ అంశంపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ప్రభుత్వం ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమని చెబుతుంటే, వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం అనుమతులు ఉంటే రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇస్తామని ప్రకటించింది.
