AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర ప్రమాదం.. పరిశ్రమలో గ్యాస్ లీక్‌తో ఉక్కిరిబిక్కిరి.. ఇద్దరు కార్మికులు మృతి!

సంగారెడ్డి జిల్లా, గడ్డపోతారంలోని ఓ పరిశ్రమలో ఘోర గ్యాస్ లీక్ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ప్రమాద కారణాలు, పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు, అనుమతులపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆరోపణలతో ఘటన మరింత చర్చనీయాంశమైంది. ఈ విషాద ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది.

ఘోర ప్రమాదం.. పరిశ్రమలో గ్యాస్ లీక్‌తో ఉక్కిరిబిక్కిరి.. ఇద్దరు కార్మికులు మృతి!
Gaddapotharam Factory Gas Leak
Balaraju Goud
|

Updated on: Oct 23, 2026 | 1:41 PM

Share

సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం గడ్డపోతారంలోని ఓ పరిశ్రమలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం (అక్టోబర్ 23) తెల్లవారుజామున గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులను సుదర్శన్, బాలాజీగా గుర్తించారు. ఈ ఘటనతో పరిశ్రమ పరిసరాల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న జిన్నారం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్యాస్ లీకేజీకి గల కారణాలు, ప్రమాదం జరిగిన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా? ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే అంశాలపై విచారణ జరగాల్సి ఉంది.

ఈ ఘటనపై సమాచారం తెలుసుకునేందుకు, పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఇద్దరు మాత్రమే మరణించారని చెబుతున్నారని, మరికొందరికి ఏమైనా జరిగిందా? పూర్తి వివరాలు ఎందుకు వెల్లడించడం లేదని అధికారులను ప్రశ్నించారు. అంతేకాకుండా, పరిశ్రమకు సరైన అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. పోలీసుల వ్యవహారశైలిపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే, ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లు వచ్చిన సమాచారానికి మించి ఇతర ప్రాణనష్టం జరిగిందా? పరిశ్రమ అనుమతులపై ఉన్న ఆరోపణల్లో వాస్తవమెంత? అనే విషయాలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. పోలీసులు, సంబంధిత శాఖల అధికారులు విచారణ చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us