AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగుజాతి గౌరవం NTRకు ‘భారతరత్న’ ఇవ్వాలి.. మహానాడులో టీడీపీ ఏకగ్రీవ తీర్మానం!

తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (NTR) 103వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నెల్లూరులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకల్లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు.

తెలుగుజాతి గౌరవం NTRకు 'భారతరత్న' ఇవ్వాలి.. మహానాడులో టీడీపీ ఏకగ్రీవ తీర్మానం!
Chandrababu Demands Bharat Ratna For Ntr
Balaraju Goud
|

Updated on: May 28, 2026 | 1:53 PM

Share

తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (NTR) 103వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నెల్లూరులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకల్లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు. దేశానికి, తెలుగుజాతికి ఆయన చేసిన అసమాన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రకటించాలని మహానాడు వేదికగా ఏకగ్రీవ తీర్మానం చేశారు.

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుజయంతిని పురస్కరించుకుని మహానాడులో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు ‘భారత రత్న’ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మహానాడు ఏకగ్రీవంగా ఆమోదించింది.

Nandamuri Taraka Ramarao Jayanthi

Nandamuri Taraka Ramarao Jayanthi

ఒక సాధారణ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి, వెండితెరపై తిరుగులేని స్టార్‌గా ఎదిగి, కేవలం తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యమైందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. “చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో నిలిచిపోయే మహనీయుడు ఆయన. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతంతో ఆయన చేసిన పాలన నేటికీ ఆదర్శం” అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనలో భాగంగానే లోకేశ్‌ మహిళలకు 33 శాతం సీట్ల కేటాయింపు ప్రకటన చేశారని గుర్తుచేశారు.

ఎన్టీఆర్ పేరు తలుచుకుంటేనే పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ మళ్లీ పుడితే తప్ప ఆయన స్థాయి క్రమశిక్షణ, ఖ్యాతి మరెవరికీ సాధ్యం కాదన్నారు. నీతి, నిజాయితీలతో రాజకీయాల్లోకి వచ్చి, పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు. ఆయన ఎక్కడ ఉన్నా, ఏం చేసినా తెలుగువారి ఆత్మగౌరవం కోసమే పరితపించారు. ఎన్టీఆర్ పాలన సమాజంలోని అన్ని వర్గాలకు భరోసా ఇచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. “దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ లాంటి నాయకుడు మరొకరు లేరు. ప్రాంతీయ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి, కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో తెలుగుదేశం కీలక పాత్ర పోషించేలా ఆయన పునాదులు వేశారు.” అని చంద్రబాబు తెలిపారు.

భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేసే క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. నిన్న జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు లోకేష్ ప్రతిపాదించిన 33 శాతం రిజర్వేషన్‌ను పార్టీలో మనమే ముందుగా అమలు చేద్దామని పిలుపునిచ్చారు. అలాగే మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

“విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు జాతి గర్వించదగ్గ మహానేత ఎన్టీఆర్‌కు ‘భారత రత్న’ ప్రకటించడం ప్రతి తెలుగువాడి కోరిక. ఇది కేవలం ఒక పార్టీ డిమాండ్ కాదు, కోట్ల మంది తెలుగు ప్రజల మనోభావం. దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చిన ఆ మహోన్నత నాయకుడికి అత్యున్నత పురస్కారం దక్కాలి” అని చంద్రబాబు స్పష్టం చేశారు.

నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నారా భువనేశ్వరి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్‌కు ఖచ్చితంగా భారతరత్న వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈ విషయంలో కేంద్రాన్ని మరోసారి కోరతామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.

అంతకుముందు ఉదయాన్నే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. తాతగారి సేవలను గుర్తుచేసుకున్న ఆయనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. జూనియర్ ఎన్టీఆర్ తిరిగి వెళ్తున్న సమయంలో అభిమానులు ‘సీఎం.. సీఎం..’ అంటూ నినాదాలు చేయడంతో ఘాట్ పరిసరాలు హోరెత్తాయి.

మొత్తంగా, ఎన్టీఆర్ ఆశయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆయన గౌరవార్థం భారతరత్న ఇవ్వడమే తెలుగుజాతికి లభించే అసలైన గౌరవమని టీడీపీ శ్రేణులు ముక్తకంఠంతో చాటిచెప్పాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us