Telangana: మద్యం మత్తులో ఈత పోటీ.. చెరువు మధ్యలో ఆగిపోయిన యువకుడు.. చివరికి..!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పండగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముస్తాబాద్ మండల కేంద్రంలో తాగిన మైకంలో ముగ్గురు యువకులు చేసుకున్న ఛాలెంజ్ ప్రాణం పోయినంత పనైంది.

Telangana: మద్యం మత్తులో ఈత పోటీ.. చెరువు మధ్యలో ఆగిపోయిన యువకుడు.. చివరికి..!
Young Man Saved
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Oct 14, 2024 | 12:50 PM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పండగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముస్తాబాద్ మండల కేంద్రంలో తాగిన మైకంలో ముగ్గురు యువకులు చేసుకున్న ఛాలెంజ్ ప్రాణం పోయినంత పనైంది. ముగ్గురు యువకులు మద్యం మత్తులో ప్రాణాలను పణంగా పెట్టారు. ఈ సంఘటన మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ముస్తాబాద్ గ్రామం సమీపంలో ఉన్న పెద్ద చెరువు దగ్గర ఉన్న పెద్దమ్మ టెంపుల్ వద్ద ముగ్గురు యువకులు ఉదయం నుండి ఫుల్లుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో ముగ్గురు మాట మాట పెరిగి పెద్దమ్మ దేవాలయం నుండి పెద్ద చెరువు కట్ట వరకు ఈత పందెం కాశారు. ఎవరు ముందుగా ఈత కొడుతూ చేరుకుంటారో అని ముగ్గురు కలిసి ఛాలెంజ్ చేసుకున్నారు. చేసుకున్న పందెం ప్రకారం ముగ్గురు యువకులు మద్యం మత్తులో చెరువులో దూకి కొంత ఈత కొట్టగా, ముగ్గురిలో ఇద్దరు యువకులు అలిసిపోయి తిరిగి ఒడ్డుకి చేరుకున్నారు.

అయితే సుమంత్ నాయక్ అనే యువకుడు అటు గమ్యం చేరుకోలేక, ఇటు ఒడ్డుకి రాలేక చెరువులోని బండరాయిపై చిక్కుకుపోయాడు. అక్కడ ఉన్న స్థానికులు కొందరు మండల మాజీ జేడ్పీటీసీ సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి ఎస్ఐ గణేష్, సిబ్బందితో చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ట్రాక్టర్ ట్యూబ్, ఒక తాడు సాయంతో చెరువులోకి తీసుకెళ్లిన కానిస్టేబుల్ కుమార్ బండపై కూర్చొని ఉండిపోయిన సుమంత్ నాయక్ ను సురక్షితంగా ఒడ్డుకి చేర్చి కాపాడాడు.

యువకుని ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ కుమార్‌ను ఎస్సై గణేష్, గ్రామస్తులు అభినందించారు. తల్లిదండ్రులు పిల్లలు సన్మార్గంలో పయనించేలా అవగాహన కల్పించాలని, పిల్లలను ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలని, వారి అలవాట్లను తెలుసుకుంటూ చెడు మార్గంలో వెళ్లకుండా చూడాలని సూచించాలని ఎస్సై గణేష్ తెలిపారు.

వీడియో చూడండి…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..