Telangana: సీఎం ఇంఛార్జిగా ఉన్న ఎంపీ స్థానంలో అభ్యర్థి ఎవరు.? టికెట్ కోసం భారీ పోటీ..
ఈసారి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌గా తీసుకున్నారు. దీంతో ప్రత్యర్థి బీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా అభ్యర్థిని బరిలో నిలపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఈ స్థానం నుంచి సీడబ్ల్యూసీ ప్రత్యేక అహ్వానిత సభ్యుడు చల్లా వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతాదయాకర్ రెడ్డిలు పోటీ చేసేందుకు అసక్తి చూపుతున్నారు...

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడడంతో పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. దీంతో హస్తం పార్టీ నేతల్లో అప్పడే ఎంపీ ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. టికెట్ కోసం ఆశావహనేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం సైతం పాలమూరు ఎంపి సెగ్మెంట్ లో ఉండడం, అలాగే స్వయంగా ఆయనే ఇంఛార్జ్ గా ఉన్న నేపథ్యంలో అభ్యర్థిత్వం ఎవరిని వరిస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది.
ఈసారి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌గా తీసుకున్నారు. దీంతో ప్రత్యర్థి బీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా అభ్యర్థిని బరిలో నిలపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఈ స్థానం నుంచి సీడబ్ల్యూసీ ప్రత్యేక అహ్వానిత సభ్యుడు చల్లా వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతాదయాకర్ రెడ్డిలు పోటీ చేసేందుకు అసక్తి చూపుతున్నారు. పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి సైతం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కల్వకుర్తి అసెంబ్లీ సీటు త్యాగం చేయడంతో పాటు గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి పోటి చేశారు.
అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వంశీచంద్ రెడ్డికి పార్లమెంట్ స్థానంపై అధిష్టానం హామీ ఇచ్చినట్లు పార్టీలో చర్చనడుస్తోంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డిని బరిలోకి దింపుతారా లేదా, రాజ్యసభ సీటు ఇస్తారా అనే అంశంపై పార్టీ హైకమాండ్ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ సినీయర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ పరిధిలో విస్తృత పరిచయాలు కలిగి ఉండడంతో పాటు, కుటుంబంపై సానుభూతి కలిసి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి సైతం టికెట్ ప్రయత్నాలు చేస్తుండడంతో ఆయన అభ్యర్థిత్వంపై సైతం పరిశీలన జరుగుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపాలనే యోచనలో బీజేపీ, బీఆర్ఎస్..
మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సైతం బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై లోతైన పరిశీలన చేశాకే బరిలో దింపాలనే యోచనలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. పార్లమెంట్ సెగ్మెంట్ లోని అసెంబ్లీ స్థానాల్లో మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ముందుగా పార్టీ శ్రేణులను సమయాత్తం చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకొని తిరుగులేని అధిపత్యం ప్రదర్శించాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రతిష్థాత్మకంగా తీసుకోవడంతో అభ్యర్థి ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
