CJI NV Ramana: తల్లితండ్రుల వలె ఆదరించారు.. తెలుగు రాష్ట్రాల పర్యటనపై భావోద్వేగానికి గురైన జస్టిస్ ఎన్‌వి రమణ

Justice NV Ramana: భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గత వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో..

CJI NV Ramana: తల్లితండ్రుల వలె ఆదరించారు.. తెలుగు రాష్ట్రాల పర్యటనపై భావోద్వేగానికి గురైన జస్టిస్ ఎన్‌వి రమణ
Justic Nv Ramana
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 20, 2021 | 10:39 PM

CJI NV Ramana: భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గత వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సహా.. ఏపీ, తెలంగాణాలోని పుణ్యక్షేత్రాలను ఆయన సందర్శించారు. ఈ పర్యటన సందర్భంగా ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాధినేతలు, అధికారులు ఘనమైన స్వాగతం పలికారు. అంతేకాదు.. ఢిల్లీ నుంచి వచ్చి మొదలు.. తిరిగి ఢిల్లీకి పయనమయ్యే వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఈ సందర్భంగా తన పట్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు చూపిన ఆదరాభిమానలకు ముగ్దులయ్యానని, ఈ ఆతిథ్యం మరువలేనిదని పేర్కొన్నారు. తన పట్ల ఎనలేని ఆదరాభిమానాలు చూపిన తెలుగు ప్రజలకు శతకోటి వందనాలు తెలిపారు. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ రమణ ఒక లేఖను రాశారు. ఆ లేఖ సారాంశం యధావిధిగా..

‘‘పిల్లలు జీవితంలో రాణించాలని తల్లిదండ్రులు తపించడం సహజం. తమ విజయాలను చూసి తల్లిదండ్రులు గర్వించాలని, ఆనందించాలని పిల్లలు ఆశించడం కూడా అంతే సహజం. నేనూ అందుకు మినహాయింపు కాదు.

నేను భారత న్యాయవ్యస్థలో అత్యున్నత స్థానానికి చేరుకున్న ఈ సమయంలో నన్ను చూసి గర్వించడానికి, మనస్ఫూర్తిగా అభినందించడానికి నా తల్లిదండ్రులు ఈ లోకంలో లేరన్న వాస్తవం బాధిస్తూ ఉండేది. భారత ప్రధాన న్యాయమూర్తిగా నా ఈ వారం రోజుల తొలి పర్యటనలో తెలుగు ప్రజలు ఆ లోటును తీర్చారు. నన్నుగన్న తల్లితండ్రుల వోలె, నన్ను పసిబిడ్డ మాదిరి అక్కునచేర్చుకుని అపార ప్రేమాభిమానాలతో, ఆశీర్వచనాలతో ముంచెత్తిన నిష్కల్మష, ప్రగతిశీల తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు. నా జీవితంలో భావోద్వేగానికి గురైన సందర్భాలలో ఈ పర్యటన ఒకటి.

కోవిడ్‌కు సైతం వెరవక, వారించినా వినక, వారనక వీరనక అసంఖ్యాకంగా వచ్చి నన్ను తమలో ఒకడిగా, ఆప్తుడిగా భావించి, అభినందించి, వెన్ను తట్టి, ఆశీర్వదించిన పెద్దలు, అక్కచెల్లెళ్లు, అన్నతమ్ముళ్లు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతాభినందనాలు. న్యాయవాదులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువత, శ్రామికులు, మహిళలు, రైతులు, సకల జీవన రంగాలకు చెందిన వారు కులమతాలకతీతంగా, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నన్ను పలకరించారు. దీవించారు. స్వంత పనులు ఎవ్వరూ ప్రస్తావించలేదు. వారు కోరిందల్లా న్యాయ వ్యవస్థను పటిష్టపరచమని మాత్రమే. తెలంగాణ సమాజపు నిస్వార్థ గుణానికి, పరిణతికి ప్రతీకలు వారు.

వయోవృద్ధులు, గురుతుల్యులైన విశ్రాంత న్యాయమూర్తులు నన్ను దీవించడానికి ఏడాదిన్నర కోవిడ్ కాలంలో తొలిసారి గడప దాటటం నన్ను కదిలించింది. వారికి నమస్సులు.

ముఖ్యమంత్రి మొదలుకుని అతి సాధారణ పౌరుని వరకు ప్రతి ఒక్కరూ ఈ అసాధారణ సమయంలో వ్యవ ప్రయాసలకోర్చి నాకు స్వాగతం కలిపికి. ‘అంతా మనోళ్లే’ అన్న తెలంగాణ నైజానికి, సుప్రసిద్ధ హైదరాబాదీ ఆతిధ్యానికి అద్దం పట్టారు. అనూహ్య స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కి, ముఖ్యమంత్రికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, న్యాయమూర్తులకు, మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు, సకల పక్షాల నాయకులకు, అధికారులకు ధన్యవాదాలు.

దివ్యాతి దివ్యమైన దైవ దర్శనానికి, ఆశీర్వచన ప్రాప్తికి అల్ప వ్యవధిలో అన్ని ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి, యాదాద్రి, శ్రీశైలం దేవస్థానాల పాలక మండళ్లకు, ప్రభుత్వ ప్రతినిధులకు, స్థానిక అధికారులకు నేనూ.. నా సతీమణి శివమాల సదా కృతజ్ఞులం. యాదాద్రిని దేశంలోనే అతి ముఖ్య తీర్థయాత్రా స్థలాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయం.

వారం క్రితం తెలుగు నేలపై కాలు మోపినప్పటి నుంచి నేడు ఢిల్లీ బయలుదేరే వరకు నన్ను, నా సిబ్బందిని కంటికి రెప్పలా చూసుకున్న తెలంగాణ ప్రభుత్వ అధికారులకు, రాజ్‌భవన్ సిబ్బందికి, హైకోర్టు సిబ్బందికి, పోలీసు సిబ్బందికి, ఎంతగానో సహకరించిన పాత్రికేయులకు కృతజ్ఞతలు.

కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోయిందని శాస్త్రవేత్తలు, ప్రభుత్వం నిర్ధారించే వరకు దయచేసి తగు జాగ్రత్తలు పాటిస్తూనే ఉండండి. నిర్లక్ష్యం ఏ మాత్రం తగదు.

తెలుగు ప్రజల దీవెనల బలంతో నా రాజ్యాంగ బద్ధ విదులను సమర్థంగా నిర్వహించగలనన్న నమ్మకంతో తిరుగు ప్రయాణమవుతున్నా.’’ అంటూ జస్టిస్ ఎన్‌వి రమణ తన లేఖలో పేర్కొన్నారు.

Also read:

కాలువలో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించిన పోలీస్…..అలీగఢ్ లో ఎస్ఐ సాహసం