Success Story: పుత్రికోత్సాహం అంటే ఇదే సుమా.. తండ్రి హమాలీ..అదే జిసిసిలో ఆఫీసర్‌గా కూతురు ఎంపిక

| Edited By: Surya Kala

Nov 26, 2024 | 10:54 AM

తండ్రి భుజాలపై నుండి ప్రతిబిడ్డ లోకాన్ని చూస్తుంది..కొందరే తండ్రి భుజాలపైనున్న బరువును చూస్తారు..తండ్రి కష్టం, తల్లి ఆశయం ఒకే సారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచి, ఐఏఎస్ లక్ష్యంగా సాగుతోంది..హమాలీ కూతురు

Success Story: పుత్రికోత్సాహం అంటే ఇదే సుమా.. తండ్రి హమాలీ..అదే జిసిసిలో ఆఫీసర్‌గా కూతురు ఎంపిక
Success Story
Follow us on

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి చెందిన హమాలీ కార్మికుడు భోగి సత్యం, రమణ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఒక కుమార్తె కే అమ్మో అనుకునే ఈ రోజుల్లో..వరుసగా ముగ్గురు కుమార్తెలు కలిగిన అధైర్య పడకుండా తన కుమార్తెలను..కొడుకు కంటే మిన్నగా పెంచారు తల్లితండ్రులు. దీంతో భోగి సత్యం దంపతుల మొదటి కుమార్తె సమ్మక్క ఒకే సారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించింది. ఇరుగుపొరుగు వారితోనే కాదు స్వగ్రామంలోనే అందరితో శభాష్ అనిపించుకుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించటానికే ఏళ్లకు తరబడి కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతూ ఇంటికి దూరమై అటు శారీరకంగా మానసికంగా కృంగిపోతున్న యువతకు స్ఫూర్తిని నింపుతూ ఇంటి దగ్గరే గదినే తన ప్రయోగశాల చేసుకొని మొక్కవోని దీక్షతో ఒక క్రమబద్ధమైన ప్రిపరేషన్ తో ఓకే సారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అటు కన్న తల్లితండ్రులకు సొంత ఊరికి పేరు తెచ్చేలా ముందుకు సాగుతోంది హమాలి బిడ్డ సమ్మక్క..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి చెందిన భోగి సమ్మక్క బాల్యం అంతా దమ్మపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే పదవ తరగతి వరకు విద్యను అభ్యసించింది. అనంతరం అశ్వరావుపేట పట్టణంలోని వీకేడివిఎస్ రాజు కళాశాలలో డిగ్రీ వరకు విద్యను అభ్యసించింది. అనంతరం పీజీ ఎంట్రన్స్ లో ఫ్రీ సీట్ సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో ఎం ఎ ఇంగ్లీష్ లో పీజీ పూర్తి చేసింది. అనంతరం స్వగ్రామానికి చేరుకున్న సమ్మక్క, అమ్మమ్మ జయలక్ష్మి ఇంటివద్దనే ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకొని క్రమం తప్పకుండా తన దినచర్యను పాటిస్తూ, తన లక్ష్యం వైపు ముందుకు సాగుతుంది.

గత ఏడాది అక్టోబర్లో విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో మొదటి ప్రయత్నంలోనే ఓపెన్ క్యాటగిరి లోనే సివిల్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించింది సమ్మక్క. అయితే తన లక్ష్యం ఐఏఎస్ కావడంతో కానిస్టేబుల్ గా వెళ్లేందుకు సిద్ధపడలేదు. తల్లిదండ్రు ప్రోత్సాహంతో ఇంటి వద్దనే ఉంటూ ఈనెల 14న విడుదల చేసిన గ్రూప్ ఫోర్ ఫలితాలలో తండ్రి పనిచేస్తున్న జిసిసి గిరిజన సహకార సంస్థలోని జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సంపాదించి తండ్రి పనిచేస్తున్న కార్యాలయంలోనే ఆఫీసర్ గా మారి అందరి చేత శభాష్ అనిపించుకుంది.

ఇవి కూడా చదవండి

అక్కడితో కూడా సంతృప్తి చెందలేదు ఈనెల 21న విడుదల చేసి రా జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియామకాలలో సైతం తన ప్రతిభ కనబరిచి ఇంగ్లీష్ విభాగంలో జూనియర్ లెక్చరర్ గా విజయం సాధించింది. ఇలా వరుసగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే.. మరెందరికో స్ఫూర్తి నింపుతూ ఆమె చెబుతున్న మాటలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

ఉద్యోగం రాలేదని ఎవరో నిరాశ చెందక్కర్లేదని లక్షలు లక్షలు ఖర్చుపెట్టి ప్రిపేర్ అయి మానసికంగా శారీరకంగా అలసిపోవక్కర్లేదని.. ఇంటి వద్దనే ఉంటూ ఒక క్రమపద్ధతిలో టైం టేబుల్ నిర్ణయించుకొని పోటీ పరీక్షలకు సంసిద్ధమైతే చాలని తప్పక విజయం సాధిస్తారని తోటి వారికి సలహాలు ఇస్తుంది. ఇదంతా తన తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకం, తనకు ఇచ్చిన స్వేచ్ఛ, మేమున్నమనే భరోసానే కారణమని అంటుంది. తను సాధించిన విజయలు, సాధించబోయే విజయాలు అన్ని తన తల్లిదండ్రులకే చెందుతాయని సమ్మక్క వినయంగా చెబుతుంది. భవిష్యత్తులో తాను ఐఏఎస్ గా ఎదిగి, గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలకు సేవ చేయటమే తన ముందున్న లక్ష్యమని, తప్పకుండా తన లక్ష్యం నెరవేర్చుకుంటానని ధీమాగా చెబుతోంది సమ్మక్క.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..