
ఆధునిక యుగంలో ఆరోగ్య సేవల అందుబాటును మరింత సులభం చేసే కొత్త మొబైల్ యాప్ ‘హెల్త్ ఆన్ అస్’ ను ఘనంగా ఆవిష్కరించారు. 2024 ఫిబ్రవరి 25న నిర్వహించిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్ హోటల్ వేదికగా నిలిచింది. ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, జనసేన పార్టీ అధినేత, కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ మొబైల్ యాప్ను ప్రారంభించారు.
‘హెల్త్ ఆన్ అస్’ (HealthOnUs) సంస్థ చైర్మన్ లింగమనేని రమేశ్, మేనేజింగ్ డైరెక్టర్, డి.జె. భరత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఫిజియోథెరపీ, నర్సింగ్ సేవలు, వైద్య చికిత్సానంతర సేవలను ఇంటి వద్దకే అందించే ఈ సరికొత్త మొబైల్ యాప్ వల్ల ఎంతో మందికి లాభం చేకూరుతుందనీ, అది ఆరోగ్య సంరక్షణలో ఒక కొత్త యుగం ప్రారంభించనుందనీ తెలిపారు. వాడుకునే వారికి సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా ఈ యాప్ ఎంతోమంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. మందుల డెలివరీ నుంచి మొదలుకొని థెరపీ సెషన్‌లు, నర్సింగ్ కేర్ వరకు ఈ మొబైల్ యాప్ సేవలుండడం ఎంతో ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టించే దిశగా ఈ యాప్ ఓ చక్కటి ఉద్యమం కాగలదని జనసేనాని ఆశాభావం ప్రకటించారు. ‘హెల్త్ ఆన్ అస్’ సంస్థ చైర్మన్ లింగమనేని రమేశ్, మేనేజింగ్ డైరెక్టర్ డి.జె. భరత్ రెడ్డి తోపాటు సంస్థ ఉద్యోగులను పవన్ కళ్యాణ్ అభినందించారు.
‘హెల్త్ ఆన్ అస్’ (HealthOnUs) సంస్థ చైర్మన్ లింగమనేని రమేష్ మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించే ఈ యాప్ ఎంతో శ్రమ, లోతైన పరిశోధనల ఫలితమని, ఇది ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఓ రక్షణ కవచమని పేర్కొన్నారు. ఈ యాప్ ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణంలో కీలక పాత్ర పోషించనుందని, అందుకే దీనికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డి.జె. భరత్ రెడ్డి మాట్లాడుతూ సంప్రదాయ ఆసుపత్రుల సేవలను మించి ఉన్నతమైన ఆరోగ్య సంరక్షణ సేవలను ఇంటివద్దకే అందించడం దీని ప్రత్యేకత అన్నారు. కార్యక్రమం అనంతరం ముఖ్య అతిథి కొణిదెల పవన్ కళ్యాణ్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ‘హెల్త్ ఆన్ అస్’ సంస్థ ఉద్యోగులు, అన్ని విభాగాల అధిపతులు, యాప్ నిర్మాణ పరిశోధక బృందం, అతిథులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..