Munugode Bypoll: అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించినా ‘హస్త’వ్యస్తం.. ఉపఎన్నిక వేళ కాంగ్రెస్‌లో కల్లోలం
షాకుల మీద షాకులు. ప్రత్యర్థుల నుంచే కాదు స్వపక్షం నుంచి విమర్శలు. మునుగోడు ఉపఎన్నిక వేళ కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిణామాలు. ఉపఎన్నిక పూర్తయ్యే లోపు ఇంకేమి చూడాల్సి వస్తోందనే ఆందోళనలో సీనియర్లు.
ఒక వైపు బీజేపీ – మరో వైపు TRSతో ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్‌కు సొంత పార్టీ నేతల తీరు మరింత కలవరం కలిగిస్తోంది. సిట్టింగ్ స్థానం మునుగోడును నిలబెట్టుకునేందుకు అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించినా ఉపఎన్నిక పోరు – హోరులో మాత్రం హస్తం వెనుకబడే ఉంది. తనను ఒంటరిని చేయడం కోసం కొందరు కుట్రలు పన్నుతున్నారని స్వయంగా TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి. తనకు PCC అధ్యక్ష పదవి వచ్చినందుకు చాలా మంది తనపై కక్ష గట్టారని రేవంత్ రెడ్డి అంటున్నారు.
రేవంత్ ఇలా అన్న కొద్ది సేపటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్ కావడం పొలిటికల్ సర్కిల్స్‌లో సంచలనంగా మారింది. పార్టీలతో సంబంధం లేకుండా తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ లీడర్లను వెంకటరెడ్డి కోరుతున్నట్టుగా ఆ ఆడియో ఉంది. తాను త్వరలోనే TPCC చీఫ్ అవుతానని, ఏమైనా తప్పిదాలు జరిగినా అవన్నీ తాను సరిదిద్దుతానని లీకైన ఆ ఆడియోలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భరోసా ఇస్తున్నట్టుగా ఉంది. పార్టీని కాదు మనిషిని చూసి ఓటేయాలని ఒక కార్యకర్తతో మాట్లాడుతున్న ఆడియో ఇప్పుడు కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
మరో వైపు కోమటిరెడ్డి ఆడియోపై మునుగోడు కాంగ్రెస్ వర్గాలు భగ్గుమన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరును తప్పుబడుతూ గాంధీ భవన్‌లో కొందరు కార్యకర్తలు నిరసనకు దిగారు. వెంకటరెడ్డిని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరో వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో వ్యవహారంలో AICC స్పందించినట్టు తెలుస్తోంది. ఆడియో గురించి AICC కార్యదర్శులు ఆరా తీసినట్టు సమాచారం. మొత్తానికి మునుగోడు ఉపఎన్నిక దగ్గరపడుతున్న కొద్ది కాంగ్రెస్‌కు కష్టాలు తీవ్రమవుతున్నట్టు కనిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..