మునిసిపల్ ఎలక్షన్స్: ముప్పేట వ్యూహంతో మూడు పార్టీలు రె”ఢీ”

మునిసిపల్ ఎలక్షన్స్: ముప్పేట వ్యూహంతో మూడు పార్టీలు రెఢీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా మునిసిపల్ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటడానికి టిఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా దూకుడు ప్రదర్శిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టిఆర్‌ఎస్‌కు ఆతరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన స్థానాలు రాకపోవడాన్ని సహజంగానే గెలుపు కాంక్షను ఆనందించే కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా 4 లోక్‌సభ స్థానాలు బిజెపి, 3 లోక్‌సభ స్థానాలు కాంగ్రెస్‌ చేజిక్కించుకోవడం కేసీఆర్‌కు అస్సలు నచ్చలేదు.”సారు కారు పదహారు’ అన్న కేటీఆర్‌ నినాదానికి […]

DONTHU RAMESH - Input Editor

| Edited By: Ravi Kiran

Jan 07, 2020 | 5:12 PM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా మునిసిపల్ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటడానికి టిఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా దూకుడు ప్రదర్శిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టిఆర్‌ఎస్‌కు ఆతరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన స్థానాలు రాకపోవడాన్ని సహజంగానే గెలుపు కాంక్షను ఆనందించే కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా 4 లోక్‌సభ స్థానాలు బిజెపి, 3 లోక్‌సభ స్థానాలు కాంగ్రెస్‌ చేజిక్కించుకోవడం కేసీఆర్‌కు అస్సలు నచ్చలేదు.”సారు కారు పదహారు’ అన్న కేటీఆర్‌ నినాదానికి కూడా గండిపడడం ఊహించని పరిణామమే. ఆ తరువాత జరిగిన జెడ్పీటీసీ, ఎంపిటిసీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో మరో ఘన విజయం సాధించి తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పార్టీని తిరుగులేని శక్తి మలచాలనే ఆకాంక్షతో టిఆర్‌ఎస్‌ రంగంలోకి దిగింది. ఈ ఎన్నికల బరువు బాధ్యతలన్నీ కేసీఆర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అప్పగించారు. కేటీఆర్‌ నాయకత్వ పటిమకు కేసీఆర్‌ మరోసారి పరీక్ష పెట్టారు. ఈ ఎన్నికల్లో జయాపజయాలు రేపటి కేటీఆర్‌ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. అందుకే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఎన్నికలను టిఆర్‌ఎస్‌ ఎదుర్కోంటోంది.

120 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు జరగబోతున్న ఎన్నికల్లో సింహభాగం కైవసం చేసుకోవడానికి ఏకంగా మునిసిపల్ చట్టంలోనే సమూలమైన మార్పులు తీసుకొచ్చింది కేసీఆర్ సర్కార్. ముందస్తు వ్యూహంతో దూకుడుగా వెళుతోంది. పార్టీ సమావేశంలో కేసీఆర్‌ మంత్రులకు, ఎమ్మెల్యేలకు తీవ్రమైన హెచ్చరిక కూడా చేశారు. మునిసిపాలిటీ ఎన్నికల్లో ఓడితే ఆ పరిధిలోని మంత్రికి పదవి ఊడుతుందని, ఆ పరిధిలోని ఎమ్మెల్యేలకు భవిష్యత్తులో పదవులు రావని హెచ్చరించారు. దీంతో రంగంలోకి దిగిన టిఆర్‌ఎస్‌ నేతలు గెలుపే లక్ష్యంగా మునిసిపాలిటీల్లో ప్రచారం ప్రారంభించారు. సీఎఎ, ఎన్‌ఆర్‌సీ అనుకూల, ప్రతికూల ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు బిజెపి ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చిన టిఆర్‌ఎస్‌ తెలంగాణలోని ముస్లిం మైనార్టీల ఓట్లకు గండి పడకుండా కాపాడుకోవడానికి సిఎఎ బిల్లును వ్యతిరేకించింది. టిఆర్‌ఎస్‌ ముస్లిం మైనార్టీల పక్షపాతి అని చాటి చెప్పగలిగింది. ఇదే అస్త్రంతో బిజెపి టిఆర్‌ఎస్‌పై ఎదురుదాడి ప్రారంభించింది. టిఆర్‌ఎస్‌ హిందూ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తోందని తీవ్రంగానే ఇంటా బయట ఎండగడుతోంది.

ఎంఐఎంతో టిఆర్‌ఎస్‌ దోస్తానా వల్లే టిఆర్‌ఎస్‌ హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని బిజెపి ఎదురుదాడి చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా “హిందువులా.. బొందువులా..’ అంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ప్రచారంలో పెట్టింది. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఎంపి స్థానాలలో లబ్దిపొందిన బిజెపి.. ఈ ఎన్నికల్లోనూ సీఎఎ, ఎన్‌ఆర్‌సీ ఎజెండాను ప్రజల ముందు పెట్టి ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తోంది. ఎంఐఎం, టిఆర్‌ఎస్‌ రెండు కూడా హిందూ వ్యతిరేక చర్యలకు పూనుకుంటున్నాయనే ప్రచారాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో కూడిన బిజెపి ప్రజల్లోకి తీసుకెళుతోంది. అయితే ఆ పార్టీ దాడిని తిప్పికొట్టి..  మునిసిపాలిటీల్లో ప్రభావిత శక్తులుగా ఉన్న ముస్లిం మైనార్టీ ఓట్లను గంపగుత్తగా పొందడం కోసం టిఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న వ్యూహం కూడా ఫలితాలు ఇస్తోంది. ముస్లిం మైనార్టీ ఓట్లు పోలరైజ్‌ అయినట్లుగా హిందువుల ఓట్లు పోలరైజ్‌ కావని, తమ నిర్ధిష్ట ఓటు బ్యాంకుకు గంపగుత్తగా ముస్లిం మైనార్టీ ఓట్లు తోడైతే తేలిగ్గా సింహభాగం మునిసిపాలిటీలను దక్కించుకోవచ్చుననే వ్యూహానికి టిఆర్‌ఎస్‌ మరింత పదునుపెట్టింది. అయితే కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానాలలో గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా ఆవిష్కృతమైన ఫలితాలే ఈ మునిసిపాలిటీల్లో వస్తాయని బిజెపి భావిస్తోంది. అందుకే టిఆర్‌ఎస్‌పై హిందూ వ్యతిరేక ముద్రవేసి ఎంఐఎంతో జతకట్టే ప్రచారానికి బిజెపి ముందుకు తీసుకెళుతోంది. బిజెపి దూకుడు చూసి టిఆర్‌ఎస్‌ కూడా అచితూచి వ్యవహరిస్తోంది. అందుకే కేటీఆర్‌ ఇటీవల కాంగ్రెస్‌ వందేళ్ల పార్టీ, కాంగ్రెస్‌ను అంత తేలిగ్గా తీసుకోం అంటూ వ్యాఖ్యానించడం వెనుక మతలబు రాష్ట్రంలో కాంగ్రెస్‌ బతికున్నా నష్టంలేదుగానీ బిజెపి వల్ల భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు.

ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సాంప్రదాయ వ్యూహాలకు ఏమాత్రం తిలోదకాలు ఇవ్వకుండా అవే కాలం చెల్లిన వ్యూహాలతో ముందుకెళుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందినా.. ఆ తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 3స్థానాలలో విజయం సాధించి ఉనికి చాటుకుంది. జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల్లో చతికిలపడ్డ కాంగ్రెస్‌.. హూజుర్‌నగర్‌ ఉప ఎన్నికల రూపంలో మరో ఘోర ఓటమి పార్టీ శ్రేణుల్లో నిరాశనిస్పృహలను తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో ఆచరణ రూపం దాల్చడంలేదు. ఎన్నికల గోదాలోకి దూకిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ మునిసిపల్ ఎన్నికల తరువాత పదవి నుండి తప్పుకుంటాననే ప్రకటన పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు ఇచ్చింది. పోలింగ్‌ ముందే కాంగ్రెస్‌ పార్టీ పరాజయాన్ని అంగీకరించిందని టిఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తోంది. ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేసినా.. ఆ తరువాత పార్టీ మారతున్నారని భావిస్తున్న ప్రజలు టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీకి ఓటువేయడానికి ముందుకు రాకుండా బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కొన్ని చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్దులుగా పోటీచేయడానికి నేతలు మందుకురాని పరిస్థితి నెలకొంది.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల్లో, ప్రజల్లో వ్యక్తం అయిన వ్యతిరేకతను మునిసిపల్ ఎన్నికల్లో అనుకూలంగా మలచుకోవాలనుకున్న కాంగ్రెస్‌ ఆశలు కూడా కేసీఆర్‌ చివరి నిమిషంలో ఆర్టీసీ కార్మికులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంతో ఆశలు గల్లంతు అయ్యాయి. మునిసిపాలిటీల్లోనే ఎక్కువగా డిపోలు ఉండడంతో కార్మికులు అక్కడ ఉండడంతో వాళ్లు కూడా టిఆర్‌ఎస్‌ వైపే మొగ్గు చూపే పరిస్థితి నెలకొంది. ఒకవేళ కాంగ్రెస్‌ అక్కడక్కడ నెగ్గినా టిఆర్ఎస్‌ రెబల్స్‌ బెడద తప్ప కాంగ్రెస్‌ వ్యూహం వల్లనయితే కాదు. ఎన్నికల ముందు పార్టీలో అంతర్గత కుమ్ములాట, పీసీసీ పదవి కోసం కొట్లాట ఇవన్నీ ప్రజలకు చికాకు తెప్పిస్తున్నాయి. అందుకే ఇలాంటి అవకాశాన్ని బిజెపి ఏదో విదంగా అనుకూలంగా మలచుకునే ప్రయత్నానికి పదును పెట్టింది. ఎంఐఎం టిఆర్‌ఎస్‌తో దోస్తానా చేస్తూనే మరో వైపు తన ఉనికికి ప్రమాదం లేకుండా చూస్తోంటే ఈ ఎన్నికల్లో లెప్ట్‌పార్టీలు, టిజెఎస్‌ నామమాత్రంగా మారిపోయాయి.

-దొంతు రమేష్‌

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu