CM KCR Sagar Meeting: హాలియాలో సీఎం కేసీఆర్ సభకు తొలగిన అడ్డంకి.. పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
Nagarjuna Sagar By-Election 2021: నాగార్జున సాగర్ లో సీఎం కేసీఆర్ సభకు న్యాయస్థానంలో అడ్డంకులు తొలగిపోయాయి. హౌస్ మోషన్ పిటిషన్ విచారణను హైకోర్టు చీఫ్ జస్టిస్ తిరస్కరించారు
Nagarjuna Sagar By-Election 2021: నాగార్జున సాగర్ లో సీఎం కేసీఆర్ సభకు న్యాయస్థానంలో అడ్డంకులు తొలగిపోయాయి. హౌస్ మోషన్ పిటిషన్ విచారణను హైకోర్టు చీఫ్ జస్టిస్ తిరస్కరించారు. దీంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈనెల 14న సాగర్‌లో సీఎం కేసీఆర్ భారీ సభ యథావిథిగా కొనసాగనుంది. ఈ క్రమంలో సభను రద్దుచేయాలని రైతులు సోమవారం వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించగా… హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పిటిషన్ విచారణను హైకోర్టు చీఫ్ జస్టిస్ తిరస్కరించారు.
సీఎం కేసీఆర్ హాలియాలో తలపెట్టిన సభను రద్దుచేయాలని, తమ అనుమతి లేకుండా, కరోనా నిబంధనలు పట్టించుకోకుండా.. తమ భూముల్లో సభ నిర్వహిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. రైతుల వేసిన పిటిషన్ ను విచారించడానికి హైకోర్టు అనుమతించలేదు. విచారణకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరాకరించారు.
ఇదిలావుంటే, హాలియా మండలంలోని అనుమల గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సభను నిలువరించాలని కోరుతూ దాఖలైన రెండు వ్యాజ్యాల్లోనూ జోక్యానికి హైకోర్టు సోమవారమే నిరాకరించింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిర్వహణ నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీహెచ్ సైదయ్య కూడా సోమవారం లంచ్ మోషన్‌లో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి విచారణ చేపట్టారు. రాజకీయ పార్టీలు కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయన్న పిటిషనర్.. ఏ ఒక్క పార్టీనీ ప్రతివాదిగా చేర్చక పోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఉల్లంఘనలకు ఆధారాలు చూపించకుండా కోర్టునెలా ఆశ్రయిస్తారని ప్రశ్నించింది.
దీంతో సాగర్‌లో బుధవారం యాధావిధిగా సీఎం కేసీఆర్ ఎన్నికల సభ జరగనుంది. మరోవైపు, సీఎం సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఈనెల 17వ తేదీన ఉపఎన్నిక జరగనుంది. 15వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఒక రోజు ముందు కేసీఆర్ సభకు ప్లాన్ చేశారు. సాగర్ ఉపఎన్నికకు దిశానిర్దేశం చేసేలా ఈ సభ ఉంటుందని భావిస్తున్నారు. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో నిబంధనల మేరకు సభ నిర్వహించాలని పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. సభకు వచ్చేవాళ్లంతా తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.
Read Also… Mamata Banerjee: ఈసీ బ్యాన్‌కు నిరసనగా మమతా బెనర్జీ ధర్నా… పెయింటింగ్స్ వేస్తూ…