AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామ హత్య కోసం రూ.5 లక్షల సుపారి… పచ్చని సంసారంలో చెడు వ్యసనాల చిచ్చు..

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పరిధిలో చోటుచేసుకున్న ఒక దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. భార్యతో కాపురానికి అడ్డొస్తున్నాడనే కక్షతో, సొంత మామనే ఓ కిరాతక అల్లుడు సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించాడు. ఆటోతో సహా వ్యక్తిని సజీవ దహనం చేసిన ఈ ఉదంతాన్ని చిరాగ్‌పల్లి పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించి, నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. అసలేం జరిగింది..?

మామ హత్య కోసం రూ.5 లక్షల సుపారి... పచ్చని సంసారంలో చెడు వ్యసనాల చిచ్చు..
Zahirabad Murder Case
P Shivteja
| Edited By: |

Updated on: Oct 13, 2026 | 4:06 PM

Share

ఆ గొడవలు కాస్తా చివరకు ఒకరి ప్రాణం తీసేవరకు వెళ్లాయి.. భార్యతో కాపురానికి అడ్డొస్తున్నాడనే కక్షతో, సొంత మామనే ఓ కిరాతక అల్లుడు సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించిన ఉదంతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆటోతో సహా వ్యక్తిని సజీవ దహనం చేసిన ఈ దారుణ ఉదంతాన్ని చిరాగ్‌పల్లి పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించి, నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు.

వ్యసనాలతో కూలిన సంసారం.. కోర్టుకు చేరిన పంచాయితీ

మొగుడంపల్లి మండలం మన్నాపూర్‌కు చెందిన మున్నూరు శ్రీనివాస్ (ఆటో డ్రైవర్) తన కూతురు మంగమ్మను వికారాబాద్ జిల్లా ఆత్కూర్‌కు చెందిన ఎర్ర బస్వరాజ్‌కు ఇచ్చి 2022లో వివాహం చేశాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంతకాలం సాఫీగానే సాగిన వీరి కాపురం.. బస్వరాజ్ చెడు వ్యసనాలకు బానిస కావడంతో రోడ్డున పడింది. భర్త వేధింపులు భరించలేక మంగమ్మ ఏడాది క్రితమే పుట్టింటికి వచ్చేసింది. కూతురి భవిష్యత్తు కోసం తండ్రి శ్రీనివాస్ ఐదు నెలల క్రితం చిరాగ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో భరణం, విడాకుల కోసం కేసు పెట్టాడు.

రూ.5 లక్షలకు ఒప్పందం.. మామను లేపేయాలని స్కెచ్

తన భార్య తన వద్దకు రాకపోవడానికి, సంసారం ముక్కలవడానికి మామ శ్రీనివాసే అడ్డు వస్తున్నాడని అల్లుడు బస్వరాజ్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతడిని మట్టుబెట్టాలని స్కెచ్ వేశాడు. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా బంట్వారానికి చెందిన సుపారీ గ్యాంగ్ సభ్యులు జడల రమేష్, జడల సుభాష్, పరిగి మురళీలను ఆశ్రయించాడు. మామను లేపేస్తే రూ. 5 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుని, రూ. 2 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు..పథకం ప్రకారం ఈనెల 7వ తేదీన సుపారీ గ్యాంగ్ శ్రీనివాస్‌కు ఫోన్ చేసి, ఆటో అద్దెకు కావాలని పిలిపించింది. శ్రీనివాస్ రాగానే తూంకుంట గ్రామ శివారులోని నిర్మానుష్య అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఎలాంటి ఆధారాలు దొరకకూడదనే ఉద్దేశంతో శ్రీనివాస్ మృతదేహంపై, ఆటోపై పెట్రోల్ పోసి నిప్పంటించి దహనం చేశారు.

ఇవి కూడా చదవండి

శ్రీనివాస్ కనిపించకుండా పోవడంతో 8వ తేదీన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన చిరాగ్‌పల్లి, జహీరాబాద్ టౌన్ పోలీస్ బృందాలు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టాయి. ఈనెల 9వ తేదీన అడవిలో కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు…సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా సహాయంతో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. ఈ ఘోరకలి వెనుక ఉన్నది అల్లుడు బస్వరాజేనని తేల్చారు. ప్రధాన నిందితుడు బస్వరాజ్‌తో పాటు సుపారీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కీలక ఆధారాలు రాబట్టి, వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును 48 గంటల్లోనే ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us