నిమ్స్ ఆస్పత్రిలో రోబోటిక్ సర్జరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేవలం ప్రైవేట్ కే పరిమితం అనుకునే టెక్నాలజీ తో కూడుకున్న ఈ రోబోటిక్ సర్జరీ ఇప్పుడు ఉచితంగా నిమ్స్ లో అందుబాటులో ఉంది. దాదాపు రూ.35 కోట్లతో ఈ పరికరాలను తీసుకొచ్చారు. అయితే ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా అనేక లాభాలు ఉన్నాయి.
ఎదైనా ఆపరేషన్ చేసేప్పుడు కోత అవసరం లేకుండా చిన్నగా 4రంధ్రాల ద్వారా ఆపరేషన్ పూర్తి అవుతుంది.పేషెంట్ కి ఆపరేషన్ టైం లో రక్తం కూడా అవసరం లేదు. ఈ రోబో చేసే ఆపరేషన్‌లో ఖచ్చితత్వం,సక్సెస్ రేట్ కూడా ఎక్కువే అంటున్నారు వైద్యులు.
అయితే రోబోటిక్ సర్జరీలో కేవలం నాలుగు రంధ్రాలే వేయడం జరుగుతుంది. ఒక కెమెరా, లైట్‌తో సహా పరికరాలుంటాయి. ఇవన్ని సర్జరీ చేసే వైద్యుడి నియంత్రణలోనే ఉంటాయి. కాబట్టి ఏ ప్రదేశాన్ని వైద్యుడు స్పష్టంగా చూడాలనుకుంటే దాన్నే చూడగలుగుతారు.దీంతో ఆపరేషన్ లో ఖచ్చితత్వం పెరుగుతుంది.
ఈ రోబో సర్జరీ యంత్రంతో ఆపరేషన్ టైం లో పేషెంట్ దగ్గర ఎవరు లేకుండా కన్సోల్ ఆపరేట్ చేస్తూ ఆపరేషన్ పూర్తి చేయవచ్చు. ఈ రోబోటిక్ ఆపరేషన్ థియేటర్‌లో పేషెంట్ కన్సోల్,సర్జన్ కన్సోల్‌లు రెండు, ఆపరేషన్ పరికరాల్లో ఉన్న కెమెరా వ్యూ కోసం ఒక మానిటర్ ఉంటాయి. ఇందులో ఉపయోగించే కెమెరా 16రెట్లు మాగ్నిఫై చేసి చూడగలిగే అవకాశం ఉంటుంది.
దీంతో చిన్న సమస్య అయినా సర్జన్ కనిపెట్టడానికి వీలు ఉంటుంది. యూరినరీ బ్లాడర్, రెక్టమ్ క్యాన్సర్ తో పాటు ఎన్నో సర్జరీలు రోబో తో చేయవచ్చు. ముందుగా పేషెంట్‌కి ఏ సర్జరీ చేయాలనుకున్నామో ఆ డిటైల్స్ ముందుగా రోబో కి ఇచ్చిన తర్వాత సర్జన్ పేషెంట్ నుంచి దూరంగా జరుగుతారు. ఆ తర్వాత సర్జన్ కన్సోల్ నుంచి ఆపరేషన్ చేస్తారు.
( రిపోర్టర్ : యెల్లేందర్ రెడ్డి, టీవీ9 )