Robbery: రివాల్వర్ తో బెదిరించి.. దారి మళ్లించి.. సరకు స్వాహా
హైదరాబాద్ నగర శివారులో ఓ దారి దోపిడీ ముఠా లారీని దారి మళ్లించారు. లారీ డ్రైవర్, క్లీనర్లను రివాల్వర్ తో బెదిరించి అందులోని సరకును దొంగిలించారు. ట్రక్కులోని రూ.37లక్షల విలువైన సరకును..
హైదరాబాద్ నగర శివారులో ఓ దారి దోపిడీ ముఠా లారీని దారి మళ్లించారు. లారీ డ్రైవర్, క్లీనర్లను రివాల్వర్ తో బెదిరించి అందులోని సరకును దొంగిలించారు. ట్రక్కులోని రూ.37లక్షల విలువైన సరకును దించి, ఖాళీ ట్రక్కును పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో వదిలేసి పరారయ్యారు. సినీ ఫక్కిలో జరిగిన ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 17న.. తమిళనాడు నుంచి లారీ టైర్ల లోడుతో వస్తున్న ట్రక్కును దారి దోపిడీ ముఠా గమనించింది. తుక్కుగూడ అవుటర్ రింగు రోడ్డు వద్ద ఇద్దరు వ్యక్తులు లారీని ఆపి.. తమను నగరానికి చేర్చాలని కోరారు. దీంతో లారీ డ్రైవర్ వారిని క్యాబిన్‌లోకి ఎక్కించుకున్నాడు. పహాడీషరీఫ్ ఠాణా సమీపానికి చేరుకుంటుండగా ఆ ఇద్దరు వ్యక్తులు వేసుకున్న ముందస్తు పథకం ప్రకారం.. రివాల్వర్ తో డ్రైవర్, క్లీనర్లను బెదిరించారు. దారి మధ్యలో మరో ఇద్దరిని ట్రక్కులో ఎక్కించుకున్నారు.
డ్రైవర్ అడ్డుకోవడంతో రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు.డ్రైవర్, క్లీనర్‌ల కళ్లకు గంతలు కట్టి ట్రక్కును మైలార్‌దేవుపల్లి వైపు తీసుకెళ్లారు. లారీలో ఉన్న టైర్లను ఓ గోదాములో దింపారు. అనంతరం డ్రైవర్, క్లీనర్ వద్ద ఉన్న నగదును లాక్కుని శ్రీశైలం రహదారిపై వారిని వదిలి పరారయ్యారు. ఈ విషయంపై బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముఠాలోని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని, చోరీ అయిన టైర్లను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.
Also Read
Flipkart Delivery: ఫ్లిప్‌కార్ట్ మరింత వేగం.. కేవలం 45 నిమిషాల్లోనే డెలివరీ సేవలు..!