CM Revanth Reddy: ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. సీఎం హోదాలో తొలిసారి ప్రధానితో భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల నూతన ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీనీ కలుసుకుంటారు. జనవరి మొదటి వారంలో జరిగే పార్టీ సమావేశానికి మున్షీనీ ఆహ్వానించే అవకాశముంది. పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలను కూడా రేవంత్‌ కలిసే అవకాశం ఉంది. ఈ నెల 28న నాగ్‌పూర్‌లో జరిగే కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ తదితర అంశాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు

CM Revanth Reddy: ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. సీఎం హోదాలో తొలిసారి ప్రధానితో భేటీ
CM Revanth Reddy

Updated on: Dec 26, 2023 | 8:09 AM

నేడు ఢిల్లీ వెళ్తున్నారు సీఎం రేవంత్‌. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తొలిసారి సమావేశం కానున్నారాయన. పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వంతో కూడా చర్చలు జరుపుతారు రేవంత్. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుతీరాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలిసారిగా నేడు ప్రధాని మోదీని కలుసుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్తారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు కలిసేందుకు రేవంత్‌కు ప్రధాని సమయం ఇచ్చారు.

ప్రధానితో రేవంత్‌ భేటీ మర్యాదపూర్వకమే అయినా ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతోపాటు రాష్ట్రానికి రావాల్సిన వివిధ రకాల గ్రాంట్ల గురించి అడిగే అవకాశముంది. విభజన చట్టంలోని నిబంధనల మేరకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉంది.

ఈ పథకం కింద హైదరాబాద్‌ మినహా అప్పటి ఉమ్మడి తొమ్మిది జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున రూ.450 కోట్లు రావాల్సి ఉంది. గత మూడు సంవత్సరాలకు సంబంధించి 1,350 కోట్ల రూపాయల గ్రాంటు పెండింగ్‌లో ఉంది. వీటిని విడుదల చేయాలని రేవంత్‌ కోరే అవకాశాలున్నాయి. కాజిపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని, బయ్యారంలో స్టీల్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తామని నాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను రేవంత్‌ ప్రస్తావించవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రాణహిత-చేవెళ్లకుగానీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకుగానీ జాతీయ హోదా ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరే అవకాశాలున్నాయి. రాజకీయ వైరుధ్యాలతో సంబంధం లేకుండా.. కేంద్ర ప్రభుత్వంతో పాలనా పరమైన సఖ్యతను ఆశిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఫోన్‌ చేసి ప్రధాని మోదీ వెసులుబాటు గురించి ఆరా తీశారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల నూతన ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీనీ కలుసుకుంటారు. జనవరి మొదటి వారంలో జరిగే పార్టీ సమావేశానికి మున్షీనీ ఆహ్వానించే అవకాశముంది. పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలను కూడా రేవంత్‌ కలిసే అవకాశం ఉంది.

ఈ నెల 28న నాగ్‌పూర్‌లో జరిగే కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ తదితర అంశాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈరోజు రాత్రికే రేవంత్‌ తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి