Hyderabad: కన్నకొడుకే కాలయముడై.. మద్యానికి డబ్బులివ్వలేదని ఏకంగా తల్లినే..
సమాజంలో రోజురోజుకూ మానవసంబంధాలు మంటకలుస్తున్నాయి. మద్యానికి బానిసలై కొందరు వ్యక్తులు కన్నవారిని, కట్టుకున్నవారినే కడతేర్చుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న ఓ పుత్రరత్నం ఏకంగా తల్లినే హత్య చేశాడు.

తాగుడుకు బానిసైన ఒక కుమారుడు మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే కడలేర్చిన ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుట్ల గ్రామానికి చెందిన సోమయ్య, ఎల్లమ్మ దంపతులకు ముగ్గురు సంతానం వీరిలో పెద్దకుమారుడు శ్రీకాంత్ గత కొంత కాలంగా మద్యానికి బానిసై రోజూ తాగి వచ్చి ఇంట్లో గొడవలు పెట్టుకునేవాడు.
ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి మద్యానికి డబ్బులు ఇవ్వాలని తల్లితో గొడవకు దిగాడు. డబ్బులు ఇచ్చేందుకు తల్లి నిరాకరించడంతో ఆగ్రహించిన శ్రీకాంత్ అక్కడే ఉన్న ఒక ఇనుప రాడ్‌తో తల్లిపై దాడికి పాల్పడ్డాడు. శ్రీకాంత్ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. కానీ మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




