బాల్య వివాహాల నుంచి మైనర్ బాలికలను కాపాడిన షీ టీమ్స్..!
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షీ టీమ్స్ ఇద్దరు మైనర్ అమ్మాయిల జీవితాలను కాపాడారు. నాగారం, జవహర్ నగర్‌కు చెందిన ఇద్దరు మైనర్ అమ్మాయిలకు వివాహం నిశ్చయించారన్న సమాచారం..

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షీ టీమ్స్ ఇద్దరు మైనర్ అమ్మాయిల జీవితాలను కాపాడారు. నాగారం, జవహర్ నగర్‌కు చెందిన ఇద్దరు మైనర్ అమ్మాయిలకు వివాహం నిశ్చయించారన్న సమాచారం తెలియడంతో.. వెంటనే రంగంలోకి దిగిన షీ టీమ్స్ వారిని రక్షించారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగానికి చెందిన ఓ మైనర్ బాలికకు.. ఓ యువకుడితో స్థానిక దేవాలయంలో వివాహం చేయబోయారు. విషయం తెలుసుకున్న షీ టీమ్స్.. కుషాయిగూడ పోలీసులతో కలిసి.. బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. అంతేకాదు.. అమ్మాయికి తల్లిదండ్రులు లేకపోవడంతో వివాహం నిశ్చియించిన బాబాయ్‌కి బాల్య వివాహం ద్వారా వచ్చే సమస్యలపై అవగాహన కల్పించారు. ఇక మరో సంఘటనలో జవహర్ నగర్‌కు చెందిన ఓ మైనర్ అమ్మాయికి అదే ప్రాంతంలో ఉండే మరో అబ్బాయితో ఆగస్టు 5వ తేదీన యాదగిరిగుట్టలో వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న షీ టీమ్స్ మైనర్ అమ్మాయి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వివాహాన్ని రద్దు చేయించారు.
ఈ సందర్భంగా.. కమిషనర్ మహేష్ భగవత్ బాల్యవివాహలను ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే బంధువులు, శ్రేయోభిలాషులు, పత్రికలు ముద్రించే వాళ్లు, పురోహితులు బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 కింద శిక్షార్హులు అవుతారని స్పష్టం చేశారు. బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం ఏదైనా తెలిస్తే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 100 కి గాని 9490617111 సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.



