Water Projects: ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు ఫుల్.. నిండుకుండలా శ్రీశైలం, సాగర్

ఎగువన వరదలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎగువ నుంచి వస్తున్న వర్షాలతో, గోదావరి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నాయి.

Water Projects: ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు ఫుల్.. నిండుకుండలా శ్రీశైలం, సాగర్
Srisailam, Nagarjuna Sagar
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 20, 2024 | 8:16 AM

ప్రాజెక్టులు ఫుల్‌ అవుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్ని నిండుకుండలా కనిపిస్తున్నాయి. గోదావరిలో వరద ఉధృతంగా ఉంది.. ఇటు కృష్ణమ్మ కూడా కదిలివస్తోంది.

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఫుల్‌ అవుతున్నాయి. నాగార్జున సాగర్‌కు మరోసారి వరద పోటెత్తింది. జలాశయానికి లక్షా 74వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటిమట్టం 590 అడుగులు చేరింది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ఈ జలకళను చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు.

ఇటు శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్‌ఫ్లోగా 1 లక్ష 29 వేల 562 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 95వేల 699 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి నిల్వ 213.4 టీఎంసీలుగా ఉంది. మరోవైపు శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తింది. వారం రోజులుగా స్వల్పంగా వస్తున్న ఇన్ ఫ్లో శనివారం మరింత పెరిగింది. 75వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు నుంచి మొత్తం 85,356 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు తుంగభద్ర జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. దీంతో 8 గేట్లు ఎత్తివేత దిగువకు దాదాపు 60,000 క్యు సెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కర్నూలు జిల్లాలోని సుంకేసుల బ్యారేజ్‌కి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద వచ్చి చేరుతోంది. స్పిల్‌వే ఔట్‌ ఫ్లో 22 గేట్లు ఎత్తిన అధికారులు 93,324 క్యూషక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారేజికి ఎగువ నుంచి 84,297 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం 12 అడుగులకు చేరింది. కుడి ఎడమ కాలువలకు 6,547 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. . అయితే వరద ఉధృతి మరింత పెరగొచ్చన్న హెచ్చరికలతో అధికార యంత్రంగం అప్రమత్తమైంది. మొత్తంగా… ఎగువన వరదలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.

వీడియో చూడండి…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..