AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఏపీలో బద్ద విరోధులు.. తెలంగాణలో వారి అనుచరులు స్నేహితులు.. తుమ్మల-పొంగులేటిని కలిపిన బంధం ఏంటి?

Telangana Elections - Khammam Politics: తుమ్మల.. ఈయనకు చంద్రబాబు అంటే మహా గౌరవం, అభిమానం. పొంగులేటి.. ఈయనకు జగన్‌ అంటే మహా ఇష్టం. విచిత్రం ఏంటంటే.. ఒకప్పుడు ఈ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడేది కాదు కూడా. అలాంటిది తుమ్మల-పొంగులేటి కలిసి నడుస్తున్నారు. ఒకే పార్టీలో పనిచేస్తూ, జిల్లాలోని అన్ని సీట్లు గెలిచే వ్యూహం రచిస్తున్నారు. ఇంతకీ, చంద్రబాబు-జగన్ ముఖ్య అనుచరుల మధ్య ఈ బాండింగ్‌కు రీజన్‌ ఏంటి? ఏ మ్యాజిక్ జరిగింది?

Telangana: ఏపీలో బద్ద విరోధులు.. తెలంగాణలో వారి అనుచరులు స్నేహితులు.. తుమ్మల-పొంగులేటిని కలిపిన బంధం ఏంటి?
Telangana Politics
Shaik Madar Saheb
|

Updated on: Oct 21, 2023 | 9:49 PM

Share

Telangana Elections – Khammam Politics: తుమ్మల.. ఈయనకు చంద్రబాబు అంటే మహా గౌరవం, అభిమానం. పొంగులేటి.. ఈయనకు జగన్‌ అంటే మహా ఇష్టం. విచిత్రం ఏంటంటే.. ఒకప్పుడు ఈ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడేది కాదు కూడా. అలాంటిది తుమ్మల-పొంగులేటి కలిసి నడుస్తున్నారు. ఒకే పార్టీలో పనిచేస్తూ, జిల్లాలోని అన్ని సీట్లు గెలిచే వ్యూహం రచిస్తున్నారు. ఇంతకీ, చంద్రబాబు-జగన్ ముఖ్య అనుచరుల మధ్య ఈ బాండింగ్‌కు రీజన్‌ ఏంటి? ఏ మ్యాజిక్ జరిగింది? చంద్రబాబు-జగన్‌ మధ్య పొలిటికల్‌ వార్‌ ఓ రేంజ్‌లో ఉందిప్పుడు. ఒకరు గాయపడిన సింహం, మరొకరు పంజా విసిరిన సింహం. వచ్చే ఎన్నికల్లో కొదమసింహాల్లాగే ఉండబోతోంది ఈ ఇద్దరి మధ్య పోరు. కాని, చంద్రబాబు-జగన్‌కు ఇష్టమైన తుమ్మల-పొంగులేటి మాత్రం ప్రియమిత్రులుగా కలిసిపోయి ఒకే పార్టీ కోసం పోరాడుతున్నారు. ఏపీలో వాళ్లిద్దరి మధ్య వైరం, తెలంగాణలో వీళ్లిద్దరి మధ్య స్నేహం. ఇలాంటి సీన్‌ సినిమాల్లో కూడా కనిపించదు. పైగా తుమ్మల-పొంగులేటి ఒకప్పటి రాజకీయ శత్రువులు అంటుంటారు. అలాంటిది.. దోస్త్ మేరా దోస్త్ అంటూ కలిసి సాగుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం ఉమ్మడిగా వ్యూహాలు రచిస్తున్నారు.

సీనియర్ నేత..

తుమ్మల నాగేశ్వరరావు. దాదాపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత. ఏ ప్రభుత్వంలో ఉన్నా జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. 1982లో ఎన్టీఆర్ విధానాలతో ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ క్యాబినెట్లలో మంత్రిగా పని చేశారు. నియోజకవర్గాల డీలిమిటేషన్ ముందు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో ఖమ్మం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. కాని, 2016 పాలేరు ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అదే పాలేరు నుంచి ఓడిపోయారు. మరోసారి బీఆర్‌ఎస్ నుంచి పాలేరు టికెట్ ఆశించినా పార్టీ అందుకు అంగీకరించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాని, చంద్రబాబు నాయకత్వం అంటే తుమ్మలకు చాలా ఇష్టం. ఇప్పటికీ చంద్రబాబుపై ఆ అభిమానం, గౌరవం ఉంది. అందుకే, చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. బీఆర్‌ఎస్‌ తరపున చంద్రబాబు అరెస్టును ఖండించిన మొదటి లీడర్‌ కూడా తుమ్మలనే. ఆ తరువాతే ఒక్కొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే తమ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పారు. చంద్రబాబు అరెస్టును ఖండించారు.

మాస్ లీడర్..

ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మాస్ లీడర్‌గా ఖమ్మం ప్రజల్లో ఫుల్‌ క్రేజ్ సంపాదించుకున్న నాయకుడు. కాంట్రాక్టర్‌గా ఉన్న పొంగులేటి 2013లో వైసీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పని చేశారు. 2014లో వైసీపీ నుంచే పోటీ చేసి ఖమ్మం ఎంపీగా గెలిచారు. రాష్ట్ర విభజన, మారిన రాజకీయ సమీకరణాలు, మారిన పరిస్థితుల కారణంగా 2016లో సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత ఆధిపత్య పోరు, వర్గ విభేదాలతో 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పొంగులేటికి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో ఏదో ఒక పదవి ఇస్తారని ఆశించినప్పటికీ ప్రాధాన్యత తగ్గిస్తూనే వచ్చారన్న విమర్శలున్నాయి. ఎంపీగా గెలిచి, ఆ తరువాత ఎటువంటి ఎన్నికల్లోనూ అవకాశం ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉండేవారు పొంగులేటి. కాని, 2023 జనవరి నుంచి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి బీఆర్‌ఎస్‌పై అసమ్మతి గళం వినిపించారు. ఏప్రిల్‌లో పొంగులేటిని బీఆర్‌ఎస్‌ సస్పెండ్ చేయడంతో జూలై 2న ఖమ్మం బహిరంగ సభలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు కూడా సీఎం జగన్‌ని వ్యక్తిగతంగా కలిశారని చెప్పుకుంటుంటారు. తాను రాజకీయాల్లోకి వచ్చిందే వైసీపీ నుంచి అని, సీఎం జగన్‌ తనకు గాడ్‌ఫాదర్‌ అంటూ గతంలో చెప్పుకున్నారు కూడా. ఇప్పటికీ వైఎస్‌ ఫ్యామిలీపై ఎనలేని అభిమానం ఉంది. ఒకరికేమో చంద్రబాబు అంటే గౌరవం, మరొకరికి జగన్ అంటే ఇష్టం. అలాంటి నేతలు.. తెలంగాణలో ఒకే పార్టీ తరపున, ఒకే జిల్లాలో, పక్కపక్క నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.

ఇద్దరిదీ ఒకే నియోజకవర్గమే..

నిజానికి డీలిమిటేషన్‌కు ముందు తుమ్మల, పొంగులేటిది సత్తుపల్లి నియోజకవర్గమే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టులు చేసుకుంటూ పెద్దస్థాయి కాంట్రాక్టర్‌గా ఎదిగారు. తుమ్మల దగ్గర కొద్ది కాలం పని చేశారు కూడా. పొంగులేటిని తుమ్మలకు శిష్యుడుగా చెబుతుంటారు. ఆ తర్వాత పొంగులేటి కూడా రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో తుమ్మల టీడీపీలో ఉంటే.. పొంగులేటి వైసీపీలో జాయిన్ అయ్యారు. రాజకీయ ఆధిపత్యం కోసం ఇద్దరి మధ్య రాజకీయ వైరం కూడా ఏర్పడింది. 2014లో పొంగులేటి వైసీపీ తరపున ఖమ్మం ఎంపీగా గెలిస్తే.. తుమ్మల టీడీపీ తరపున ఖమ్మం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. విభజన తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవడంతో.. ఆంధ్రా ప్రాంత పార్టీలుగా ముద్రపడిన.. వైసీపీ, టీడీపీ నుంచి ఈ ఇద్దరూ బయటకు వచ్చారు. సీఎం కేసీఆర్ ఆహ్వానంతో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు పొంగులేటి కూడా 2016లో బీఆర్‌ఎస్‌లో చేరారు. తుమ్మల కూడా అదే 2016లో బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. ఓడిపోయిన తుమ్మలకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇచ్చారు సీఎం కేసీఆర్. అయితే, ఖమ్మం జిల్లాలో వివిధ పార్టీల్లో ఉన్న ముఖ్యనేతలందరూ బీఆర్‌ఎస్‌లోనే ఉండటంతో కార్ ఓవర్ లోడ్ అయ్యింది. సొంత పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు, వర్గ విభేదాలు పెరిగాయి. ఒకరి ఓటమికి మరొకరు పనిచేశారనే విమర్శలూ ఉన్నాయి. రాజకీయ శత్రువులుగా తుమ్మల, పొంగులేటి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ వచ్చిందని చెబుతారు. ఫలితంగా 2018 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది.

మనసు మార్చుకున్న నేతలు..

మొత్తానికి నాలుగేళ్ల తరువాత తుమ్మల ఇంటికి వెళ్లి స్వయంగా కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. పైగా పాలేరు టికెట్టే కావాలని పట్టుబట్టిన తుమ్మల.. పొంగులేటి కోసం నియోజకవర్గాన్ని మార్చుకున్నారు. ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అంతేకాదు, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి పదికి పది స్థానాలు గెలిపిస్తామని ఈ ఇద్దరూ శపథం చేశారు. పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలు పక్కపక్కనే ఉంటాయి. దీంతో ఒక నియోజకవర్గంలో ఉన్న వేవ్ పక్క నియోజకవర్గానికీ పాకుతుంది. అందులోనూ పొంగులేటికి ఖమ్మంలోనూ అనుచరులు ఉన్నారు. అటు ఖమ్మంలో కమ్మ సామాజికవర్గమే ఎక్కువగా ఉండడం, బీఆర్‌ఎస్ తరపున పోటీ చేస్తున్న పువ్వాడ అజయ్‌ది కూడా అదే సామాజికవర్గం కావడంతో.. తుమ్మలనే బెస్ట్‌ ఛాయిస్‌ అనుకుంది కాంగ్రెస్ పార్టీ. అటు పాలేరులో రెడ్డి సామాజికవర్గానిదే హవా. అందుకే, పొంగులేటి కోసం పాలేరు సీటు వదులుకున్నారు తుమ్మల. ఒకవేళ షర్మిల పాలేరు నుంచి పోటీ చేసినా.. ఆ పోటీని పొంగులేటి అయితేనే తట్టుకోగలరన్న నమ్మకంతో ఆయనకు ఆ సీటును ఖరారు చేశారు. మొత్తంగా కనిపిస్తున్న అనుకూల పరిస్థితులతో అటు పొంగులేటి, ఇటు తుమ్మల కదనోత్సాహంతో ఉన్నారు. ఒకప్పటి రాజకీయ శత్రువులు నేడు మిత్రులుగా మారడంతో కాంగ్రెస్‌ పార్టీలోనూ కొత్త జోష్ కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..