ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 12న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ.. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు. మొదట బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రామగుండం వెళ్లి.. ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని మోడీ పర్యటన కారణంగా రాష్ట్ర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశారు. భద్రత, శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దంటూ ఆదేశాలిచ్చారు. కాగా, ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఇటు తెలంగాణ భారతీయ జనతా పార్టీ సైతం.. అలర్ట్ అయ్యింది. రామగుండం జరగనున్న ప్రధాని మోడీ సభకు భారీ ఎత్తున జనసమీకరణకు సన్నాహాలు చేస్తోంది. పెద్ద ఎత్తున రైతులు సభకు హాజరయ్యేలా తెలంగాణ బీజేపీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యింది.
ఈ మేరకు బీజేపీ తెలంగాణ చీఫ్, బండి సంజయ్.. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ప్రధాని మోడీ సభను విజయవంతం చేసేలా జనసమీకరణ, రవాణా, రైతులను తరలించడం పలు విషయాలపై సమగ్రంగా చర్చించారు. ప్రధాని మోడీ సభను విజయవంతం చేయాలని బండి సంజయ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రామగుండంలో ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సవాలుగా తీసుకుని.. ప్రధాని మోడీ సభకు లక్షలాదిగా తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని బండి సంజయ్ నేతలకు సూచించారు.
కాగా, తెలంగాణలో ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు విషయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలపై పలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరవుతారా..? లేదా..? అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక వేళ హాజరైతే ఎలాంటి పరిణామాలు జరగురుతాయి.. అనేది చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..