ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం అంకెనపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫోన్‌పే ద్వారా వచ్చిన డబ్బుల విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య వివాదం హత్యకు దారితీసింది. వాగ్వాదం తీవ్రం కావడంతో నీరజ్ కత్తితో రాహుల్ గొంతు కోసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఫోన్‌పే ద్వారా పంపిన డబ్బుల విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన చిన్న వివాదం.. దారుణ హత్యకు దారితీసింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం అంకెనపల్లిలోని ప్రముఖ ఎంఆర్ఎఫ్ (MRF) పరిశ్రమ ఎదుట శనివారం ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాహుల్, నీరజ్ ఇద్దరూ స్థానికంగా ఓ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తూ ఒకే గదిలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో నీరజ్ కుటుంబ సభ్యులు రాహుల్ ఫోన్‌పే ఖాతాకు కొంత నగదు పంపించారు. ఆ డబ్బును తనకు ఇవ్వాలని నీరజ్ రాహుల్‌ను కోరాడు. అయితే తన మొబైల్ ఫోన్ రిపేర్‌లో ఉందని, ప్రస్తుతం డబ్బులు తీసి ఇవ్వడం సాధ్యం కాదని రాహుల్ చెప్పినట్లు సమాచారం.
అయితే.. విషయంపై నీరజ్ రాహుల్ ను పలు మార్లు నిలదీశాడు.. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నీరజ్.. గదిలో ఉన్న కత్తితో రాహుల్ గొంతు కోసినట్లు పోలీసులు తెలిపారు.. తీవ్రంగా గాయపడిన రాహుల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. అనంతరం నిందితుడు నీరజ్ అక్కడి నుంచి పరారయ్యాడు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న సదాశివపేట పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నీరజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
